Heatwave Alert:


ఉష్ణోగ్రతలు పెరుగుతాయ్..


ఎండాకాలం వచ్చేసిందంటే జనాలు భయపడిపోతున్నారు. ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే వేడి గాలులు మొదలయ్యాయి. క్రమంగా ఉక్కపోత అధికమవుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకూ షాక్ ఇచ్చింది. ఈ సారి ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అధికంగా ఉండే ప్రమాదముందని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉష్ణోగ్రతల వల్ల కలిగే జబ్బులతో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. ఈ మేరకు National Action Planను అనుసరించాలని తెలిపారు. దేశంలో పలు చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయని, వేడి కారణంగా పలు వ్యాధులు వచ్చే అవకాశముందని వెల్లడించారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ తరహా వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని  సూచించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (NPCCHH)లో భాగంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరిట ఈ లేఖలు పంపింది. పట్టణాలు, జిల్లాల్లోని ఆరోగ్య విభాగాలు ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే వ్యాధులను కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పింది. మరోసారి అందుకు తగినట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ వర్కర్లు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఫ్లూయిడ్స్, ఐస్‌ప్యాక్‌లు, ORSలు రెడీగా ఉంచుకోవాలని సూచించింది. తాగునీరు కూడా సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. 


ఎండాకాలం వ్యాధులివే..


ఎండాకాలంలో పెద్దగా వ్యాధులేవీ రావు అనుకుంటారు చాలా మంది. కానీ కేవలం వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. అందరికీ రావాలని లేదు కానీ, అధిక శాతం మంది ఈ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వేసవిలో వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుంటే, వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం. ఆ ఆరోగ్య సమస్యల జాబితా ఇదిగో...


ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఎక్కువ శాతం మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. దానికి కారణం వాతావరణంలో వేడి పెరగడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. నిల్వ ఉండదు. ఆ విషయం తెలియని చాలా మంది నిల్వ ఉన్న ఆహారాన్ని తిని ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. అందుకే వేసవిలో నిల్వ ఆహారాన్ని తినేముందు ఓసారి పాడైందో లేదో చెక్ చేసుకుని తినండి. కాస్త వాసన వచ్చినా దాన్ని తినకపోవడమే మంచిది. 


డయేరియా
ఎండవేడి చాలా మంది తట్టుకోలేరు. అలాంటివారు డయేరియా, అతిసారం బారిన పడుతుంటారు. పాడైన ఆహారం తినడం వల్ల, మద్యపానం వల్ల కూడా డయేరియా వస్తుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే వేసవి అంతా నీళ్లు అధికంగా తాగాలి. ఎర్రటి ఎండలో బయట తిరగడం మానేయాలి. 


చికెన్ పాక్స్
తెలుగిళ్లల్లో దీన్ని అమ్మోరు అని పిలుచుకుంటారు. పిల్లలపై అధికంగా దాడి చేస్తుంది. వేసవిలో వ్యాధుల్లో ఇది ఒకటి. చిన్న దద్దుర్లులా వచ్చి మంట పెడతాయి. ఇది అంటువ్యాధి కూడా. జ్వరం కూడా అధికంగా వస్తుంది. 


Also Read: Onion Prices: సామాన్యులను భయపెడుతున్న ఉల్లి ధరలు, కిలో రూ.1,200