HD Revanna Arrest: కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణని కర్ణాటక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మహిళ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే హెచ్‌డీ రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. అయితే...ఈ వీడియోలో కనిపించిన పని మనిషిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించారంటూ ఆరోపణలు వచ్చాయి. కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితుడిని ముందుగా పోలీసులు గుర్తించారు. ఆ తరవాత హెచ్‌డీ రేవణ్ణని అరెస్ట్ చేశారు. అయితే...అంతకు ముందు హెచ్‌డీ రేవణ్ణ తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మధ్యంతర బెయిల్ కోరారు. కానీ బెంగళూరు కోర్టు ఆ రిక్వెస్ట్‌ని కొట్టివేసింది. ఫలితంగా..పోలీసుల అరెస్ట్‌కి లైన్ క్లియర్ అయింది.
బాధితురాలు హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో ఐదేళ్ల పాటు పని చేసింది. మూడేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చేసింది. అయితే..ఏప్రిల్ 29వ తేదీన రేవణ్ణ సన్నిహితుడు సతీష్ తన తల్లిని కార్‌లో తీసుకెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే...ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో వీళ్లు కూడా సాక్ష్యం చెబుతారేమో అన్న అనుమానంతో ముందుగానే వాళ్లని కిడ్నాప్ చేయించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కొడుకుని కాపాడుకునేందుకు ఇలా సాక్షుల్ని తప్పిస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో మిగతా సాక్షుల్నీ ఇలాగే బెదిరిస్తున్నారా అన్నది తేలాల్సి ఉందని, వాళ్లకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. కొడుకు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు హెచ్‌డీ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కిడ్నాప్ కేసు కూడా తోడవడం మరింత సంచలనమవుతోంది.
ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్నారు. ఆయన కనబడితే అరెస్ట్ చేయాలంటూ కర్ణాటక హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసుని విచారిస్తోంది. ఎక్కడ ఉన్నా వెంటనే వచ్చి విచారణకు హాజరు కావాలని హోంశాఖ ప్రజ్వల్‌ని హెచ్చరించింది. ఇంట్లో వంట మనిషిని లైంగికంగా వేధించడంతో పాటు మరి కొంత మంది మహిళలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలు కూడా రికార్డ్ చేసి బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించడం సంచలనమైంది. అయితే...అతని తరపు న్యాయవాది మాత్రం అవన్నీ మార్ఫింగ్ వీడియోలు అంటూ వాదిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కావాలనే కుట్ర చేసి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: Lok Sabha Elections 2024: ప్రచారానికి డబ్బుల్లేక ఎంపీ టికెట్ తిరిగి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి