Woman Farmer questions KTR in Sircilla- సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు సొంత ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఇంకెప్పుడు పరిష్కారం చూపిస్తారని ఓ మహిళా రైతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిలదీశారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ ఆ మహిళా రైతును సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నడు ఇస్తరు.. కేటీఆర్ ను ప్రశ్నించిన మహిళా రైతు
సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెడికల్ కాలేజీకి ఇచ్చిన వ్యవసాయ భూములపై బోనాల లక్ష్మీ అనే ఓ మహిళా రైతు ఈ సందర్భంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ కోసం రెండు ఎకరాలు భూమి ఇచ్చానని, అందుకు పరిహారం ఇవ్వలేదని తమకు న్యాయం జరగలేదని కేటీఆర్ ను ఆమె నిలదీశారు. కలెక్టర్ కు చెప్పి న్యాయం చేపిస్తానని కేటీఆర్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తన డబుల్ బెడ్ రూం ఇంకెప్పుడు ఇస్తారు అని మహిళా రైతు ప్రశ్నించడంతో కేటీఆర్ అవాక్కయ్యారు. గవర్నమెంట్ కు భూమి ఇస్తే కచ్చితంగా ప్లాట్ వస్తుందని, ఆందోళన చెందవద్దన్నారు. మార్కెట్లో వసతులు, సెక్యూరిటీ సరిగ్గా లేవని.. తమను బెదిరిస్తున్నారని మహిళా రైతు కేటీఆర్ కు చెప్పి వాపోయారు.
సిరిసిల్లలోని స్థానిక రైతు బజార్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. కూరగాయలు అమ్ముకునే రైతులు కేటీఆర్ దృష్టికి పలు సమస్యల్ని తీసుకువచ్చారు. మార్కెట్లో ఎండకు తట్టుకోలేకపోతున్నామని, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వేసవి కాలం కనుక తాగునీరు సైతం అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చాలని కోరారు. 24 గంటల్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి, త్వరలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
గుడి ముఖ్యమైతే కేసీఆర్ ఎప్పుడో యాదాద్రి ఆలయం కట్టారు..
పేదల కోసం కొట్లాడే వాళ్లకు మాట్లాడే వాళ్లకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో సిరిసిల్ల వాళ్లు కూడా ఓట్లేస్తే బీజేపీ వాళ్లు ఏం చెబుతున్నారు. రాముడి గుడి కట్టినం, మాకు ఓటేయండి అంటున్నారు. అయితే కేసీఆర్ యాదాద్రిలో అద్భుతమైన ఆలయం కట్టలేదా, అభివృద్ధి చేయకుండా ఓట్లు అడిగే వాళ్లకు ఓట్లు వేయవద్దన్నారు. రోడ్లు వేసినం, కాలేజీలు తెచ్చినం, నీళ్లు ఇచ్చినం, రాజన్న సిరిసిల్ల చేశామన్నారు. నవీన శిల్పులతో అద్భుతమైన శిల్పకళతో యాదాద్రిలో గుడి కట్టడం మాత్రమే కాదు, ఆధునిక దేవాలాయాల్లాంటి ప్రాజెక్టులు కట్టి వాటికి దేవుళ్ల పేర్లే పెట్టామని గుర్తుచేశారు.
రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ అని పేర్లు పెట్టాం. కొందరు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. హిందువు అయితే మాకు ఓటేయండని బీజేపీ వాళ్లు అంటున్నారు. వాళ్లు రాకముందు హిందువులు లేరా, దేవుళ్లు లేరా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అనే వ్యక్తి ఎన్నికల తరువాత ఒక్కసారి కూడా కనిపించలేదని, ఆయనకు మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. అకౌంట్లు తెరిస్తే ఖాతాల్లో లక్షల రూపాయల ధనం వేస్తామన్న ప్రధాని మోదీ ఏం చేశారు. రాజధర్మం పాటించి ప్రభుత్వం పేదలను పట్టించుకోవాలి కానీ మతం పేరిట రాజకీయాలు చేయడం తగదన్నారు.