Lok Sabha Polls 2024: ఎన్నికల ప్రచారం అంటే సవాలక్ష ఖర్చులుంటాయి. ఏటా ఈ వ్యయం పెరుగుతూనే ఉంది. అధికారికంగా ఎన్నికల సంఘం ఒక్కో అభ్యర్థి చేయాల్సిన ఖర్చెంతో లెక్కలు చెబుతున్నప్పటికీ...అనధికారికంగా అంత కన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. ఈసీ ఆదేశాల ప్రకారం పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో ఒక్కొక్కరూ రూ.75 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అయితే...క్షేత్రస్థాయిలో మాత్రం  ఇంత కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ప్రచారం కొనసాగుతుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఓ కాంగ్రెస్ అభ్యర్థికి ఇదే జరిగింది. ప్రచారానికి డబ్బుల్లేక ఎంపీ టికెట్‌ని తిరిగి ఇచ్చేశారు. ప్రచారం చేయడం తన వల్ల కాదని తేల్చి చెప్పారు ఒడిశాలోని పూరి ఎంపీ అభ్యర్థి (Sucharita Mohanty) సుచరిత మొహంతి. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ తనకు నిధులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదని,తన సొంత డబ్బులతో ప్రచారం చేసుకునే స్థోమత లేదని వెల్లడించారు. అందుకే టికెట్‌ని వెనక్కి ఇచ్చేసినట్టు వివరించారు. 


"పూరి నుంచి పోటీ చేయాలనుకున్నా ప్రచారానికి నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే పోటీ చేయలేకపోతున్నాను. చేతిలో చిల్లిగవ్వ లేకుండా క్యాంపెయిన్ చేయడం చాలా కష్టం. అందుకే...నాకు ఇచ్చిన ఎంపీ టికెట్‌ని తిరిగి కాంగ్రెస్ పార్టీకే అప్పగిస్తున్నాను"


- సుచరిత మొహంతి, కాంగ్రెస్ నేత







ఎవరీ సుచరిత మొహంతి..?


జర్నలిస్ట్‌గా పని చేసిన సుచరిత మొహంతి (Who is Sucharita Mohanty) మాజీ కాంగ్రెస్ ఎంపీ బ్రజమోహన్ మొహంతి కూతురు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేడీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ నిధుల కొరత కారణంగా బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఒడిశా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజోయ్ కుమార్‌పై విమర్శలు చేశారు. సొంత ఖర్చులతోనే ప్రచారం చేసుకోవాలంటున్నారని మండి పడ్డారు. 


"పదేళ్ల క్రితం నేను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాను. అప్పుడు నాకు జీతం వచ్చేది కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. ప్రస్తుతం పూరిలో ఎన్నికల ప్రచారానికి నా దగ్గర ఉన్నదంతా పెట్టేశాను. ప్రచారాన్ని కొనసాగించేందుకు ప్రజల నుంచి కూడా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నించాను"


- సుచరిత మొహంతి, కాంగ్రెస్ నేత


Also Read: Gaza News: సంధికి సరే అంటే దాడులు ఆపేస్తాం, లేదంటే విధ్వంసమే - హమాస్‌కి ఇజ్రాయేల్‌ స్ట్రాంగ్ వార్నింగ్