Haryana Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల పంపకాలు తెగకపోవడంతో పొత్తులు లేవు. ఇప్పుడు రెండు పార్టీలు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఎన్నికలకుగానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన మూడు జాబితాల్లో 40 మంది అభ్యర్థులను ఆప్ ప్రకటించగా... తాజాగా మరో 21 మందితో ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 61 మంది అభ్యర్థులను ప్రకటించారు.


వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రత్యర్థులు వీరే 
కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్‌ బరిలోకి దింపింది.  హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేయనున్న లాడ్వా స్థానం నుంచి జోగా సింగ్‌ పేరును కూడా పార్టీ పేర్కొంది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేస్తుందన్న ప్రకటన తర్వాత జులనా సీటు ఆసక్తికరంగా మారింది.  హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్‌ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి. కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె డబ్ల్యూ డబ్ల్యూ  ఈ(WWE) లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్‌ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ డబ్ల్యూ డబ్ల్యూ ఈ నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. కవితా దలాల్ కొంతకాలం క్రితమే ఆప్‌లో చేరారు. 



జింద్ జిల్లాకు చెందిన కవిత దలాల్, యూపీలోని బాగ్‌పత్ జిల్లాలో ఉన్న బిజ్వాడ గ్రామానికి చెందిన కోడలు. డబ్ల్యూ డబ్ల్యూ ఈలో భారతదేశం నుండి బరిలోకి దిగిన మొదటి మహిళా రెజ్లర్ ఆమె. కవితా దలాల్‌కు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు.  ఆమె జింద్ జిల్లాలోని జులానా తహసీల్‌లోని మాల్వి గ్రామంలో జన్మించారు. 2009లో కవిత పెళ్లి చేసుకున్నారు. ఆమె 2012 లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె డబ్ల్యూ డబ్ల్యూ ఈ విడిచిపెట్టారు. కానీ తన భర్త స్ఫూర్తితో మళ్లీ ఆమె ఆట కొనసాగించారు. కవిత ఇటీవల సూట్-సల్వార్‌లో కుస్తీ పట్టి వార్తల్లో నిలిచింది. కవిత తండ్రి ఓంప్రకాష్ దలాల్ డిసెంబర్ 2023లో మరణించారు. కవిత తల్లి పేరు జ్ఞానమతి. ఐదుగురు తోబుట్టువుల్లో కవిత నాలుగో వారు.. తన ఇద్దరు సోదరీమణులు సునీత, గీత. ఇద్దరు సోదరులలో సంజయ్ దలాల్ కవితకు పెద్దవాడు, సందీప్ దలాల్ ఆమె కంటే చిన్నవాడు.


జులనా నుంచి ఎవరు రంగంలో ఉన్నారు?
జింద్ జిల్లాలోని జులనా స్థానం నుంచి కాంగ్రెస్ వినేష్ ఫోగట్, బీజేపీ కెప్టెన్ యోగేష్ బైరాగి, జేజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ ధండాను బరిలోకి దింపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కవితా దలాల్‌కు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు జులనా కోసం పోరులో ఇద్దరు మహిళా రెజ్లర్లతో పాటు మాజీ పైలట్, ఒకప్పటి ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ ధండా పోటీలో ఉన్నారు. జింద్ జిల్లాలో బీజేపీ ఎన్నడూ ఈ స్థానాన్ని గెలుచుకోలేదు. 2005లో కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని గెలుచుకుంది.


లేడీ ఖలీ
కవితా దలాల్‌ను లేడీ ఖలీ అని కూడా అంటారు. కవిత తన రాజకీయ జీవితాన్ని 2022లో ప్రారంభించింది. కానీ అంతకు ముందు ఆమె రెజ్లింగ్‌లో చాలా పాపులారిటీ సంపాదించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా 'ఫస్ట్ లేడీ' అవార్డు అందుకున్న కవితా దలాల్.. 12వ ఆసియా క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించింది. 2016లో మరోసారి ఈ పతకాన్ని సాధించారు. దీని తరువాత, అతను ది గ్రేట్ ఖలీస్ కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చేరారు. తద్వారా ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. 2017లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని, దాని కింద శిక్షణ ప్రారంభించారు. 2018లో కవిత తొలిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ బరిలోకి దిగింది. కవిత అదే సంవత్సరం నెక్స్ లైవ్ ఈవెంట్‌లో కూడా అరంగేట్రం చేశారు. కవితా దలాల్ మై యంగ్ క్లాసిక్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ఆమె నిత్యం ముఖ్యాంశాలలో నిలుస్తూనే ఉన్నారు. 2022లో కవిత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితురాలినై పార్టీలో చేరానని తెలిపారు. 


పోటీదారులు వీరే.. 
 అంబాలా కంటోన్మెంట్ నుండి రాజ్ కౌర్ గిల్, యమునానగర్ నుండి లలిత్ త్యాగి, లద్వా నుండి జోగా సింగ్, కైతాల్ నుండి సత్బీర్ గోయత్, కర్నాల్ నుండి సునీల్ బిందాల్, పానిపట్ రూరల్ నుండి సుఖ్బీర్ మాలిక్,  గనౌర్ నుండి సరోజ్ బాలా రాఠీ పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సోనిపట్ నుండి దేవేందర్ గౌతమ్, గోహనా నుండి శివ కుమార్ రంగీలా, బరోడా నుండి సందీప్ మాలిక్, జులనా నుండి కవితా దలాల్, సఫిడాన్ నుండి నిషా దేశ్వాల్, తోహానా నుండి సుఖ్వీందర్ సింగ్ గిల్, కలన్‌వాలి నుండి జస్దేవ్ నిక్కా, సిర్సా నుండి షామ్ మెహతా పేర్లను కూడా పార్టీ పేర్కొంది. అంతేకాకుండా, ఉక్లానా నుంచి నరేందర్ ఉక్లానా, నార్నాండ్ నుంచి రాజీవ్ పాలి, హంసీ నుంచి రాజేందర్ సోర్ఖి, హిసార్ నుంచి సంజయ్ సత్రోడియా, బాద్లీ నుంచి హ్యాపీ లోహ్‌చాబ్, గుర్గావ్ నుంచి నిశాంత్ ఆనంద్ బరిలో నిలిచారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆప్ కూడా విడుదల చేసింది.


Also Read: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్