Har Ghar Tiranga:
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగ" (Har Ghar Tiranga)ఉద్యమంలో భాగంగా ఈ పని చేయాలని కోరారు. 1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, స్వేచ్ఛాయుత భారత పతాకాన్ని చూడాలని కలలు కన్న మహనీయులందరినీ తలుచుకోవాల్సిన సందర్భమిది. వారి స్ఫూర్తికి అనుగుణంగా, వారి కలలు నెరవేర్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో
మనకున్న అనుబంధాన్ని ఈ ఉద్యమం ఇంకా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్‌లు చేశారు.