ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి జరిగి 5 రోజులు కావస్తోంది. ఇరు దేశాల  మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.  తమ భూభాగంలోకి చొరబడిన హమాస్‌ బలగాలను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది.  ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు.  అయితే అత్యంత విస్తృతమైన నిఘా వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దాడి  విషయాన్నిఎందుకు  ముందుగానే కనపెట్టలేకపోయింది అన్న ఘటనపై సర్వత్ర ఆందోళన  వ్యక్తం అవుతోంది. ఇజ్రాయెల్‌ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ  మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ విషయం  వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు విఫలమైనట్టే. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతమని నిస్పందేహంగా చెప్పొచ్చు. పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపుల్లోనూ, లెబనాన్, సిరియా, ఇంకా ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇన్ఫార్మర్లూ ఉన్నారు.


ఈ నేపధ్యంలో  హమాస్ దాడుల ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది.  ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. హమాస్ చేసిన ఉగ్రదాడిని అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఏజెన్సీలు ఎలా విఫలం అయ్యాయి అన్న అంశం పైనే  ఇండియన్ ఆర్మీ దృష్టి సారించింది. గూఢచార విభాగం సమాచార సేకరణలో విఫలమవడాన్ని కూడా భారత సైనిక బలగాలు అధ్యయనం చేస్తున్నాయి. 


ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గతంలో కూడా చాలాసార్లు  మిలిటెంట్ నేతల కదలికల గురించి పక్కా సమాచారం తెలుసుకుని, సరైన సమయంలో దాడులు చేసి వారిని అంతం చేసింది. ఒక్కోసారి  డ్రోన్లతో దాడులు, ఏజెంట్ల సాయంతో కార్లకు జీపీఎస్ పరికరాలు అమర్చి ట్రాక్ చేసి దాడి చేయడం, సెల్ఫోన్ బాంబులు కూడా జరిపేది. అంతే కాదు ఎల్లప్పుడూ  ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుంది.


అలాగే ఇజ్రాయెల్  ఇంటలిజెన్స్ సంస్థ  మోసాద్ సామర్ధ్యం కూడా తక్కువ కాదు.  దేశీయంగా పనిచేసే ఇంటలిజెన్స్ సంస్థ షిన్ బెట్ కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అత్యంత అధునాతన ధర్మల్ ఇమేజింగ్ , తిరుగాడే సెన్సార్స్, ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఈ దేశానికి లేని స్థాయిలో ఉండే సరిహద్దుల ఫెన్సింగ్ అమరికలు ఉంటాయి. మరోవైపు  ప్రపంచం నుంచి దాదాపు ఒంటరిగా ఉంటున్న హమాస్ ప్రపంచంలోనే శక్తివంతమైన, సాంకేతికంగా ముందంజలో ఉండే, ముఖ్యంగా అమెరికా అండదండలున్న ఇజ్రాయెల్ నిఘా నుంచి ఎలా తప్పించుకుని ఆ దేశంలో అడుగు పెట్టింది. అంటే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ నిర్ఘాంతపరిచేలా ఇజ్రాయెల్ దేశ సరిహద్దులోకి చొచ్చుకుని వచ్చి పౌరులను హమాస్ హతమార్చింది,  కొందరిని బందీలుగా హమాస్తీసుకువెళ్ళింది అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి.