Haldwani Violence Row: ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీలో జరిగిన హింసాత్మ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకూ 5 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 


"ఈ ఘటనపై మొత్తం మూడు FIRలు నమోదు చేశాం. అందులో 16 మంది పేర్లను చేర్చాం. వీళ్లలో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. పలు చోట్ల కర్ఫ్యూ ఎత్తివేశాం. హింస జరిగిన ప్రాంతాల్లో ఆంక్షలు సడలించాం. 5 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం"


- పోలీస్ అధికారులు






గాయపడిన వాళ్లలో పోలీసులతో పాటు జర్నలిస్ట్‌లూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాళ్లకి చికిత్స అందిస్తోంది. వాళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మిగతా వాళ్లు కోలుకున్నట్టు తెలిపారు. ఈ అల్లర్లు జరిగిన మరుసటి రోజు అక్కడి రోడ్లన్నీ ఎడారిని తలపించాయి. ధ్వంసమైన వాహనాల్ని తరలించారు. ఫిబ్రవరి 8వ తేదీన హల్‌ద్వానిలో హింస చెలరేగింది. మదర్సాతో పాటు పక్కనే ఉన్న మసీదుని కూల్చి వేయడం స్థానికంగా అలజడి సృష్టించింది. అవి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పిన అధికారులు కూల్చివేశారు. ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం హల్‌ద్వానీ నగరం అంతటా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవల్ని నిలిపిలేసింది. ఆందోళనలకారులు కనిపిస్తే కాల్చేయాలని (Shoot at sight) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మసీదుని, మదర్సాని కూల్చి వేస్తున్న సమయంలోనే ఈ అల్లర్లు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారు. కొంత మంది మున్సిపల్ కార్మికులు, జర్నలిస్ట్‌లకూ గాయాలయ్యాయి. అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్‌ బయట వాహనాలకు నిప్పంటించడం మరింత ఆందోళనలకు దారి తీసింది.కోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఆ నిర్మాణాలను కూల్చామని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. బుల్‌డోజర్ వచ్చి వాటిని కూల్చి వేసే సమయంలో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.


Also Read: లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తాం - అమిత్ షా సంచలన ప్రకటన