Amit Shah on CAA: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act)పై కేంద్రహోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అవేవీ అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవని అన్నారు. 


"కొంత మంది పని గట్టుకుని ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి హక్కుల్నీ లాగేసుకోవడం లేదు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు పడి భారత్‌కి వచ్చిన వాళ్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం"


- అమిత్ షా, కేంద్రహోం మంత్రి


పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కోల్పోయిన హిందువులు, సిక్కులు,బుద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు అమిత్‌షా. 2014 డిసెంబర్ 31వ తేదీన కానీ అంతకన్నా  ముందుకానీ భారత్‌కి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 370 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని మొత్తంగా NDA 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్ం చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ లేదని తేల్చి చెప్పారు. 


"జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించింది 370కిపైగా సీట్లలో గెలిపిస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. NDA 400 సీట్లు పక్కాగా గెలుచుకుంటుంది"


- అమిత్‌ షా, కేంద్రహోం మంత్రి 


పార్లమెంట్‌లో White Paper ని ప్రవేశపెట్టడంపైనా స్పందించారు. ఈ సమయంలో అది కచ్చితంగా అవసరం అనిపించిందని, అందుకే తీసుకొచ్చామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందే చెప్పే హక్కు తమకు ఉందని అన్నారు. ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని విమర్శించారు. పదేళ్ల మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని అందుకే వైట్‌పేపర్‌ని పబ్లిష్ చేశామని వివరించారు. 


దేశవ్యాప్తంగా మరో వారం రోజుల్లో CAA (Citizenship Amendment Act) అమలు చేస్తామంటూ ఇటీవల కేంద్రమంత్రి శంతను ఠాకూర్ (Shantanu Thakur) చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కేవలం పశ్చిమబెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది కచ్చితంగా అమలై తీరుతుందని తేల్చి చెప్పారు. బెంగాల్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు శంతను ఠాకూర్. బెంగాల్‌లోని బనగాం ఎంపీగా ఉన్న ఆయన కేంద్రహోం మంత్రి అమిత్‌ షా గురించీ ప్రస్తావించారు. CAA అమలుకు అంతా సిద్ధం చేశారని స్పష్టం చేశారు. నిజానికి బీజేపీ ఎజెండాలో CAA ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఓ సారి అమలు చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగడం వల్ల కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఘర్షణలు జరిగాయి. అందుకే అప్పటికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే..ఏడాది కాలంగా మరోసారి CAAపై చర్చ జరుగుతోంది. అమిత్‌షా ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. 


Also Read: విమానం టేకాఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు - ఒక్కసారిగా టెన్షన్