Pakistan Elections: భారత దాయాది దేశం పాకిస్థాన్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో(Pakistan Elections) ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ ఇవ్వకుండా.. సంకీర్ణం(Coaelation) దిశగా దేశాన్ని నడిపించారు. గత గురువారం జరిగిన ఎన్నికల్లో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఫైట్ జరిగింది. అయితే.. వీటిలో ప్రముఖ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imrankhan) నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ(PTI) పోటీ నుంచి దూరమైంది. అయితే.. ఈ పార్టీ తరఫున 250 మంది అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలిచారు. ఇక, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ(PML-N), దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)లు ఎన్నికల్లో ప్రధానంగా తలపడ్డాయి. మొత్తం 266 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 250 స్థానాల ఫలితాలను శనివారం ఉదయం వరకు వెల్లడించారు. ఆదివారం వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగనుందని అధికారులు తెలిపారు.
రిజల్ట్ ఇదీ..
+ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా బరిలో దిగిన వారిలో ఇప్పటి వరకు 99 మంది విజయం దక్కించుకున్నారు.
+ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో 71 మంది గెలుపు గుర్రం ఎక్కారు.
+ బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున బరిలో నిలిచిన వారిలో 53 మంది విజయం సాధించారు.
+ మరో 15 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
సంకీర్ణం తప్పదు!
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే.. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పేలే కనిపించడం లేదు. దేశంలో మొత్తం 342 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఒక స్థానంలో ఎన్నికలకు ముందు అభ్యర్థి చనిపోవడంతో వాయిదా వేశారు. ఇక, మిగిలిన స్తానాల్లో 10 సీట్లను ముస్లిమేతర మైనారిటీ వర్గాలకు రిజర్వ్ చేస్తారు. మరో 60 సీట్లను అచ్చంగా మహిళలకే కేటాయిస్తారు. వీరిని పార్టీలు సంఖ్యాపరంగా 5శాతం ఓట్లతో నామినేట్ చేస్తాయి. ఇక, పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. మేజిక్ ఫిగర్.. 135 సీట్లు దక్కాల్సి ఉంది. కానీ, ఏ పార్టీకీ ఇప్పుడు పూర్తిస్థాయిలో మేజిక్ ఫిగర్ చేరువ కాలేదు. దీంతో సంకీర్ణం తప్పనిపరిస్థితి ఏర్పడింది.
సంకీర్ణం మంచిదేనా?
సంక్షుభిత దేశంగాఉన్న పాకిస్థాన్‌ను ఎంతో సరిదిద్దాల్సిన అవసరం ఉందనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సంకీర్ణం ఏర్పడడం సరికాదనేది ప్రపంచ స్థాయిలో వినిపిస్తున్న మాట. సంకీర్ణ సర్కారు వస్తే.. అనేక సమస్యలు , సవాళ్లు పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ ద్రవ్య నిధి సంస్థ(IMF) నుంచి బెయిల్ ఔట్ పొందడం అత్యంత ఆవశ్యకంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న బెయిల్ ఔట్(bailout programme) మరో మూడు వారాల్లో ముగియనుంది. సంకీర్ణ ప్రభుత్వం ఉంటే.. IMF బెయిల్ ఔట్‌కు అంగీకరించే సమస్యేలేదు. ఇది పెద్ద విపత్తుగా మారనుంది.
ఇవీ ప్రభావాలు..
``సంకీర్ణ ప్రభుత్వం అస్థిరంగా, బలహీనంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సైన్యం పుంజుకునే అవకాశం ఉంటుందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి`` అని వాషింగ్టన్, DC లోని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్‌లో ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ అధ్యయనాల డైరెక్టర్ మార్విన్ వీన్‌బామ్ అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై అనేక ఆరోపణలు రావడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణ విశ్వసనీయత తేలే వరకు ఫలితాలను గుర్తించకుండా ఉండవలసిందిగా విదేశాంగ శాఖను కోరుతున్నానన్నారు.
"ఇప్పుడు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ప్రజలతో నిలబడాల్సిన సమయం" అని మరో ప్రతినిధి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ "పాకిస్థానీ ప్రజల అభీష్టాన్ని తారుమారు చేసేందుకు సైన్యం జోక్యం చేసుకుంటూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు పెరుగుతున్న సాక్ష్యాలను చూసి తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని" అన్నారు.
కింగ్ మేకర్‌గా ఇమ్రాన్!
ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కింగ్ మేకర్‌గా మారనున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీ పీటీఐ నేరుగా తలపడకపోయినా.. ఆయన పార్టీ తరపున స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో 99 మంది విజయం దక్కించుకున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. జైల్లో ఉండే ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. ఆయన పార్టీపై అణిచివేత ఉన్నప్పటికీ PTI "అఖండ విజయం`` సాధించింది. ఈ నేపథ్యంలో మేజిక్ ఫిగర్ దక్కించుకునే క్రమంలో ఇతర పార్టీలకు .. పీటీఐ తరఫున గెలిచిన వారి అవసరం ఉంటుందనేది పరిశీలకుల అంచనా.