Ban on Halal Products: 


హలాల్ ఉత్పత్తులపై నిషేధం..?


మహారాష్ట్రలోనూ హలాల్ ఉత్పత్తులపై నిషేధం (Halal Products) విధించాలని బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే స్పష్టం చేశారు. యూపీలో ఇప్పటికే ఈ నిషేధం అమలవుతోందని, మహారాష్ట్రలోనూ ఇదే విధంగా కఠినంగా వ్యవహరించాలని కోరారు. హలాల్ సర్టిఫికేషన్‌ కోసం సేకరించిన నిధులను ఉగ్రవాదులకు తరలిస్తున్నారని ఆరోపించారు. హలాల్‌తో పాటు లవ్ జిహాద్‌పైనా దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కుట్రని అడ్డుకోవాలని అన్నారు. హలాల్‌పై నిషేధం (Ban on Halal Products) విధించి యూపీ ప్రభుత్వం మంచి పని చేసిందని ప్రశంసించారు. మహారాష్ట్రలో హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్న సంస్థలపైనా నిఘా పెంచాలని సూచించారు. 


"హలాల్, లవ్ జిహాద్, జిహాద్..ఈ మూడూ చాలా పెద్ద సమస్యలు. ముఖ్యంగా హలాల్ సర్టిఫికేషన్‌ల నుంచి సేకరిస్తున్న డబ్బుని ఉగ్రవాదులకు తరలిస్తున్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ నిధుల్ని వినియోగిస్తున్నారు. అందుకు తగిన ఆధారాలు మా దగ్గరున్నాయి. యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించారు. ఇదే విధంగా మహారాష్ట్రలోనూ నిషేధం విధించాలి. కచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. మహారాష్ట్రలో రెండు సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాయి. ఈ రెండు సంస్థలపైనా నిషేధం విధించాలి"


- నితేశ్ రాణే, బీజేపీ ఎమ్మెల్యే


నవంబర్ 18న యోగి సర్కార్ హలాల్ ఉత్పత్తులపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది. హలాల్ ఉత్పత్తులు నిల్వ, సరఫరా, విక్రయాలను బ్యాన్ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.


కేంద్రమంత్రి వ్యాఖ్యలు..


హలాల్‌పై నిషేధం (Ban on Halal) విధించాలన్న డిమాండ్ పెరుగుతున్న క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Union Minister Giriraj Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులెవరూ హలాల్ మాంసాన్ని తినకూడదని తేల్చి చెప్పారు. అందుకు బదులుగా Jhatka మాంసాన్ని మాత్రమే తినాలని అన్నారు. ఝట్కా (Jhatka Meat) అంటే బలి ఇచ్చిన జంతువు మాంసం. బిహార్‌లోని బేగుసరై నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గిరిరాజ్ సింగ్. హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను అందరూ కాపాడుకోవాలని...ఆహారపు అలవాట్లనూ కొనసాగించాలని సూచించారు. హలాల్ మాంసం తినకూడదంటూ అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. అంతే కాదు. ప్రతి చోటా ఝట్కా మాంసాన్ని విక్రయించేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వ్యాపారాన్ని విస్తృతం చేయాలని అన్నారు. కొన్ని వారాల క్రితం..గిరిరాజ్‌ సింగ్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కి లేఖ రాశారు. యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించడాన్ని ప్రస్తావించారు. బిహార్‌లోనూ ఇదే నిబంధన అమలు చేయాలని కోరారు. హిందువులందరూ పని నుంచి వచ్చాక అయినా సరే సాయంత్రం కాస్త వీలు చేసుకుని ఆలయానికి వెళ్లాలని సూచించారు. సనాతన ధర్మానికి మించిన ధర్మం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. 


Also Read: Lok Sabha Security Breach: లోక్‌సభ దాడి ఘటనలో మరో ట్విస్ట్,పోలీసుల అదుపులో రిటైర్డ్ డీఎస్‌పీ కొడుకు