Opposition MPs March: 


ఎంపీల ర్యాలీ..


పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Winter Session) నుంచి దాదాపు 143 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు డిమాండ్ చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ...ప్రతిపక్ష ఎంపీలు భారీ ర్యాలీ (Opposition MP's Rally) నిర్వహించారు. పార్లమెంట్ హౌజ్ నుంచి విజయ్ చౌక్‌ వరకూ ర్యాలీ చేశారు. లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన 97 మంది, రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన 46 మంది ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రంగా మండి పడ్డారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ, అమిత్‌ షా సభలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సభలో ఈ చర్చ తీసుకొచ్చిన ప్రతిసారీ అధికార పక్ష ఎంపీలు తమను అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు ర్యాలీ చేశారు. భారత దేశ చరిత్రలోనే ఇంత మంది ఎంపీలు ఇలా ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. 


"లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్‌లకు మేం పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ అధికారపక్ష ఎంపీలు మాత్రం ఆ చర్చే జరగనివ్వడం లేదు. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారు"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






143 మంది సస్పెండ్.. 


ఈ మాస్ సస్పెన్షన్‌పై I.N.D.I.A కూటమి నేతలు స్పందించారు. డిసెంబర్ 22న జంతర్ మంతర్‌ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చారు. మొత్తం మూడు దశల్లో 143 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ హత్య చేసిందంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా మండి పడుతున్నారు. తమతో చర్చించకుండానే బిల్స్‌ని ప్రవేశపెట్టి ఆమోదిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 






పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం (Security Breach Parliament)ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ ఇంజనీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. బగల్‌కోటేలోని ఆ టెక్కీ ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు ఢిల్లీకి తరలించారు. అరెస్ట్ అయిన యువకుడు మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు కావడం మరింత సంచలనమవుతోంది. లోక్‌సభలో దాడి ఘటనలో ఈ యువకుడి హస్తమూ ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు.


Also Read: Anti Cold Drug: నాలుగేళ్ల లోపు చిన్నారుల జలుబు మందుపై నిషేధం, భారత్ సంచలన నిర్ణయం