ఏడాదిన్నరగా కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ. చేతికందిన పిల్లలను దూరం చేసుకున్న తల్లిదండ్రులు కొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు. పెళ్లి చేసుకొని ఏడాది గడవకముందే భర్తను కోల్పోయిన భార్యలు. ఇలా ఒకటా రెండా.. తరచి చూస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో ఉన్నాయి.
అలాంటి విషాద గాథే గుజరాత్ వడోదరలో జరిగింది. కరోనా వచ్చి ఓ వ్యక్తి ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ పై చావుబతుకుల మధ్య ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన భార్య తన భర్త వీర్యం కావాలని కోర్టు మెట్లెక్కింది. అసలు ఏం జరిగింది..?
కన్నీటి కథ..
గుజరాత్ వడోదరకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. అయితే ఆమె భర్తకు ఇటీవల కరోనా వచ్చింది. వడోదరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. కొద్ది రోజులు మాత్రమే బతికే అవకాశం ఉందని చెప్పారు.
ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను వదిలి వెళ్లిపోతాడనే మాట విన్న భార్య తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. భర్త ప్రేమను చిరకాలం పొందాలనుకొని ఆయన వీర్యాన్ని ఇవ్వాలని వైద్యులను కోరింది. దీనికి ఆమె అత్తమామలు కూడా అంగీకరించారు. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదు. రోగి పరిస్థితి బాలేదని ఆయన అనుమతి లేనిదే వీర్యం సేకరించలేమని వైద్యులు చెప్పారు. చివరికి కోర్టు ఆదేశిస్తే చేస్తామని చెప్పడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసర విచారణ కింద తన పిటిషన్ ను స్వీకరించాలని కోరింది.
గుజరాత్ హైకోర్టులో ఈ కేసు సంచలనంగా మారింది. ఆమె వాదన విన్న కోర్టు అభ్యర్థనను ఆమోదించింది. ఆమె భర్త నుంచి వెంటనే వీర్యం సేకరించి భద్రపరచాలని, ఐపీఎస్ విధానం ద్వారా ఆమె గర్భం దాల్చేందుకు సహకారం అందించాలని ఆసుపత్రికి సూచించింది. కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి వర్గాలు ఆమె భర్త వీర్యాన్ని వెంటనే సేకరించి భద్రపరిచాయి. ఇలా భర్త చనిపోయినా కూడా వారి ప్రేమకు గుర్తుగా బిడ్డను పొందాలనుకున్న ఆమె కోరిక నెరవేరనుంది.
ఈ కేసుపై సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరిగింది. చాలా మంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఆమె కోరిక ఫలించాలని పోస్ట్ లు పెడుతున్నారు.
ALSO READ
ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు!