ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటో తేదీ వస్తోందంటే.. టెన్షన్ పట్టుకుంటోంది. మధ్యతరగతి జీవులు... ఎలా అయితే ఒకటో తేదీ వస్తుందని కంగారుపడతారో.. అచ్చంగా అలాగే ఏపీ పరిస్థితి ఉంది. జీతం వస్తుందనే ఆనందం కన్నా.. కట్టాల్సినవే ఎక్కువ ఉండటమే అసలు టెన్షన్. కట్టాల్సింది బారెడు... ఆదాయం మూరెడు తరహాలో ఉంది ఏపీ సర్కారు పరిస్థితి. వాలంటీర్లను పెట్టి ఒకటో తేదీనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వాటికి రూ. పదిహేను వందల కోట్ల వరకూ కావాలి. ఇక ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు. నెలవారీగా రుణాల కోసం చెల్లించాల్సిన వాయిదాలు, వడ్డీలు ఇలా అన్నీ కలిపి దాదాపుగా రూ. 13వేల కోట్ల రూపాయలు అవసరం.
అయితే ప్రస్తుతం ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉంది. అంటే... ప్రభుత్వం దగ్గర నిధులేమీ లేవన్నమాట. అయితే.. మధ్యతరగతి జీవికి జీతాలు వచ్చినట్లుగా ఏపీ సర్కార్‌కు కూడా ఒకటో తేదీన కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుంది. జీఎస్టీ సర్దుబాట్లు, పన్నుల వాటా, కేంద్ర పథకాల నిధులు.. ఇలా పలు రకాల సోర్స్‌ల ద్వారా కొంత మొత్తం ఆదాయం.. ఏపీ ఖాతాకు జమ అవుతుంది. అయితే అది మరీ భారీగా ఉండదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల మధ్యనే ఉంటుందని అంచనా. ఒక్కో నెల ఇది రూ. రెండు వేల కోట్లే ఉన్నా ఆశ్చర్యం లేదు. మిగతా రూ. ఆరేడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం.. వచ్చిన మొత్తం వచ్చినట్లుగా... వివిధ రకాల అత్యవసర చెల్లింపులకు వాడుకుంటోంది. అంటే... ఇప్పుడు జీతాలు చెల్లించాలంటే కచ్చితంగా అప్పు తేవాల్సిందే.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన విషయం ఆర్థిక శాఖ అధికారులకు కూడా తెలియదు. తనను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారని కిషన్ రెడ్డి ట్వీట్ చేసే వరకూ ఎవరికీ తెలియదు. ఆయన అప్పుల కోసమే.. ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఆర్థికశాఖాధికారులతో సమావేశమవుతున్నారు. గత రెండు, మూడు నెలల నుంచి ఆర్బీఐలో వారానికి రూ. రెండువేల కోట్ల బాండ్లను వేలంం వేయడం ద్వారా.. నిధులు సమకూర్చుకుని జీతాలిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులకు చాలా ఆలస్యంగా జీతాలొస్తున్నాయి. ఈసారి ఆర్బీఐ కూడా.. బాండ్ల వేలానికి అడ్డుపుల్ల వేసిందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఆర్బీఐ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితిని నిర్దేశిస్తుంది. ఆ రుణపరిమితిని రెండు భాగాలుగా చేస్తుది. డిసెంబర్ వరకూ ఓ భాగం.. డిసెంబర్ నుంచి మార్చివరకూమరో భాగం అప్పులు తీసుకునేందుకు అవకాశం ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఏపీ చేసిన అప్పుల లెక్కలను తీసుకున్న కేంద్రం... రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా తేల్చింది. కోత వేసిన రుణపరిమితి మేరకు ఇప్పటికే ఏపీ అప్పు చేసిందని కేంద్రం గుర్తించింది. ఈ మొత్తంలో రూ. 3650 కోట్లు మినహా మొత్తం అప్పుగా తీసేసుకున్నారు. ఆ మొత్తం జనవరి తర్వాతనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే తీసుకునే అవకాశం కల్పించాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థికశాఖపై ఒత్తిడి తెస్తున్నారు. అలాగే.. మద్యం ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలోకి జమ చేసి.. ఆ ఆదాయాన్ని హామీగా పెట్టి.. స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రూ. 21వేల కోట్లకుపైగా తీసుకున్నారు. ఈ సంస్థ ద్వారా మరో రూ. 3500 కోట్లు రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే.. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వస్తాయి. పెన్షనర్లకు పెన్షన్ వస్తుంది. లేకపోతే.. మళ్లీ ఈ నెలలాగే... వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా జీతాల కోసం సర్దుబాటు చేస్తూ పోతారు. అంటే.. పదిహేనో తేదీ వరకూ.. జీతాలు ఇచ్చుకుటూ వెళ్లే అవకాశం ఉంది.