భారత్‌తో తొలి రెండు టెస్టుల కోసం 17 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టుని తాజాగా ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 17 వరకూ ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ జరగనుండగా.. తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ టీమ్‌ని హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ ప్రకటించాడు.




ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మళ్లీ టెస్టు టీమ్‌లోకి రాగా.. గాయాల కారణంగా ఫాస్ట్ బౌలర్లు జోప్రా ఆర్చర్, క్రిస్‌వోక్స్ సెలెక్షన్‌కి అందుబాటులో లేరు. ఇంగ్లాండ్ జట్టులోకి ఓపెనర్ హసీబ్ హమీద్ దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. 24ఏళ్ల హమీద్ 2016లో భారత్‌తో చివరిగా టెస్టు ఆడిన ఆడాడు. అనంతరం టెస్టులకి దూరమైపోయాడు.


అలానే ఏడేళ్ల క్రితం చేసిన జాత్యాంహకార ట్వీట్‌లతో గత నెల సస్పెన్షన్‌కి గురైన ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్.. ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆ సస్పెన్షన్‌ని ఎత్తివేయడంలో మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. జూన్ నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతనిపై అరంగేట్రం టెస్టు తర్వాతే సస్పెన్షన్ పడటం గమనార్హం.


తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), బెన్‌ స్టోక్స్, రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జోస్ బట్లర్, మార్క్‌వుడ్, శామ్ కరన్, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీ, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్.


అవేష్‌ ఖాన్‌ ఔట్‌!


భారత యువ ఫాస్ట్‌బౌలర్‌ అవేష్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌ పర్యటన అర్ధంతరంగా ముగిసినట్లే. డర్హమ్‌లో టీమ్‌ ఇండియా, కౌంటీ ఎలెవన్‌ సన్నాహక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆట సందర్భంగా గాయపడ్డ అతడు.. ఆ మ్యాచ్‌తో పాటు పర్యటనకు దూరం కానున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అవేష్‌.. కౌంటీ ఎలెవన్‌కు ఆడాడు. అవేష్‌ భారత్‌కు స్టాండ్‌బై ఆటగాడు. గాయం వల్ల అవేష్‌ చాలా రోజులు ఆటకు దూరమవుతాడని, భారత్‌కు ఓ నెట్‌ బౌలర్‌ తగ్గుతాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ‘‘ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అవేష్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతడి బొటన వేలిలో పగులు వచ్చింది. కనీసం నెల రోజులు బౌలింగ్‌ చేయలేడు. ఆ తర్వాత పునరావాసం మొదలవుతుంది. అతడి గాయంపై మరో మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది’’ అని వివరించాడు. 24 ఏళ్ల అవేష్‌ 26 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఏదో ఒక దశలో అతడు అరంగేట్రం చేసేవాడని చాలా మంది భావించారు.