Gujarat Road Accident:
నవశ్రీ ప్రాంతంలో ప్రమాదం..
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 48పై నవశ్రీ ప్రాంతంలో ఓ బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. నవశ్రీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి 11 మందిని తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మిగతా 17 మందిని వల్సద్‌లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తరవాత బస్ డ్రైవర్‌కు హార్ట్ అటాక్ వచ్చిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్‌లోని ప్రయాణికులంతా అహ్మదాబాద్‌లో ఓ వేడుకలకు హాజరైన తరవాత వల్సాద్‌కు తిరిగి వస్తున్నారు. రేష్మ గ్రామం వద్ద ఓ కార్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా చాలా సేపు రోడ్డుపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్ సాయంతో బస్‌ను పక్క జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం ఎందుకు జరిగిందన్నది ఇంకా తెలియలేదు. అయితే...ప్రాథమికంగా తేలిందేంటంటే...కార్ రాంగ్ రూట్‌లో వచ్చి ముందు డివైడ్‌రను ఢీకొట్టింది. ఆ తరవాత బస్‌వైపు దూసుకెళ్లింది. కార్ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. గాయ పడిన వారికి వైద్య ఖర్చుల కోసం రూ.50,000 అందిస్తామని తెలిపారు.