Gujarat Elections 2022: 


మోదీ నేతృత్వంలో సమావేశం..


గుజరాత్ ఎన్నికలకు భాజపా రంగం సిద్ధం చేసుకుంటోంది. అభ్యర్థుల జాబితాను నేటితో ఫైనల్ చేయనుంది. ఈ మేరకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సాయంత్రానికి కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గుజరాత్ బీజేపీ అభ్యర్థులెవరో తేలిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గుజరాత్ సీఎం భూపేంట్ర పటేల్, గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమావేశమై అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అమిత్‌షా, జేపీ నడ్డా నివాసాల్లో భేటీ అయ్యారు. దాదాపు మూడు రోజులుగా గాంధీనగర్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసే పని పూర్తైంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దీన్ని ఫైనలైజ్ చేస్తే..వెంటనే ఆ జాబితాను ప్రకటిస్తారు. అయితే...పీఎం మోదీ నేతృత్వంలో జరగనున్న తుది సమావేశానికి సీనియర్ నేతలంతా హాజరుకానున్నారు. కేవలం అభ్యర్థుల ప్రకటనే కాకుండా ఎన్నికల ప్రచార వ్యూహాలనూ చర్చించనున్నారు. గుజరాత్‌లో మునుపెన్నడూ లేనంత మెజార్టీ సాధించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 20-25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈ ఎన్నికల పోటీ నుంచి తప్పించనున్నట్టు సమాచారం. వీరిలో సీనియర్ నేతలూ ఉన్నారు. ఈ సారి పూర్తి స్థాయిలో కొత్త వారినే బరిలోకి దింపాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...హార్ధిక్ పటేల్,అల్పేష్ ఠాకూర్, రవీబ జడేజలకు ఈ సారి MLA టికెట్‌లు దక్కే అవకాశముంది. వీరితో పాటు కొందరికి మరోసారి పోటీచేసే అవకాశం కల్పించనుంది బీజేపీ. సీఎం భూపేంద్ర పటేల్, మంత్రి హర్ష్ సంఘ్వీతో పాటు మరో 10 మందికి మరోసారి అవకాశం ఇవ్వనుంది. 


అగ్రేసర్ గుజరాత్..


హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన బీజేపీ...ఇప్పుడు గుజరాత్‌పై దృష్టి సారించింది. ఈ మేరకు "అగ్రేసర్ గుజరాత్" (Agresar Gujarat) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలో సూచించాలని ప్రజలను కోరింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీ ఆర్ పాటిల్ ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ నెల 15 వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. గాంధీనగర్‌లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వేదికగా ఈ క్యాంపెయిన్ వివరాలు వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టోపై సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గురించి ప్రస్తావించిన సీఆర్ పాటిల్...ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "సుదీర్ఘ కాలంగా నిర్లక్ష్యానికి గురైన హామీలు నెరవేర్చాం. బీజేపీ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేదే లేదు. ఈ ఎన్నికల్లో మేము రికార్డు స్థాయిలో విజయం సాధిస్తాం. అంతకు ముందే ప్రజల సూచనలు, సలహాలు తీసుకోవాలనుకుంటున్నాం" అని వెల్లడించారు. 


Also Read: Gujarat Elections 2022: ఆపరేషన్ గుజరాత్‌లో బిజీబిజీగా పార్టీలు, ఎవరి వ్యూహాలు వాళ్లవి