Gujarat Elections 2022:
యూనిఫామ్ సివిల్ కోడ్..
గుజరాత్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో భాజపా సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల కంటే ముందే..Uniform Civil Codeను అమలు చేయాలని పావులు కదుపుతోంది. నేటి కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చిందని, త్వరలోనే దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తారనీ తెలుస్తోంది. ఈ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు అవసరమైన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోనుంది ఈ కమిటీ. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో...అప్పుడే కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ భాజపాపై దాడి మొదలు పెట్టాయి. కాంగ్రెస్ నేత శక్తిసింగ్ గోహీ దీనిపై స్పందించారు. "రాజ్యాంగం ప్రకారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే హక్కు లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం పని. అసలు సమస్యలపై భాజపా మాట్లాడటం లేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి చర్చే లేదు" అని మండి పడ్డారు. అటు ఆప్ కూడా ఇదే స్థాయిలో విమర్శలు చేస్తోంది. "ఎన్నికల ముందు భాజపా ఎన్ని విన్యాసాలు చేసినా అవేవీ పెద్దగా ప్రభావం చూపించవు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ...అది ప్రజలపై ఎలాంటి ప్రభావమూ చూపించదు" అని తేల్చి చెప్పారు.
అంటే ఏంటి..? (What is Uniform Civil Code?)
సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే తేదీలు..
నవంబర్ 1, 2 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశముంది. రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న తొలి విడత, డిసెంబర్ 4 లేదా 5న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమ్‌ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విషయం వెల్లడించారు. "గుజరాత్‌కు ఎవరు ముఖ్యమంత్రి కావాలో మీరే నిర్ణయించి చెప్పండి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతే కాదు. ఈ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్‌కు కాల్ చేసి ఎవరైనా సలహా ఇవ్వొచ్చని తెలిపారు. ఈ వ్యూహంతో వీలైనంత మేర ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది ఆప్.
Also Read: Poonam Kaur at Rahul Yatra: రాహుల్ పాదయాత్రలో పూనమ్ కౌర్ - చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరిన నటి