UK PM Rishi Sunak:
విదేశీ సహకార నిధులు ఫ్రీజ్..
బ్రిటన్ ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్...దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పొరుగు దేశాలకు "సాయం" రూపంలో అందించే నిధులను (foreign aid) రెండేళ్ల పాటు నిలిపివేయాలని భావిస్తున్నట్టు Telegraph తెలిపింది. ఆ మేరకు ఖజానాను కాపాడుకోవాలని చూస్తున్నట్టు వెల్లడించింది. దేశ ఆదాయంలో ఈ విదేశీ సహాయం కోసం చేస్తున్న ఖర్చు 0.5 శాతమే అయినప్పటికీ అది కూడా భారంగా భావిస్తున్నారు రిషి సునాక్. అందుకే..రెండేళ్ల పాటు ఆ నిధులను విడుదల చేయకుండా ఫ్రీజ్ చేయనున్నారు. నిజానికి కరోనా కారణంగా..రెండేళ్ల పాటు ఈ నిధులను ఫ్రీజ్ చేసింది యూకే. ఆ సమయంలో రిషి సునాక్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ నిధులు 0.7%కి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు రిషి సునాక్. అంటే...దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిన తరవాత మళ్లీ ఆ నిధులను విడుదల చేయాలని భావిస్తున్నారు. సునాక్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కొన్ని హామీలు ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారో వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నారు. భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తప్పవని వెల్లడించారు.
అభినందనలు..
ప్రధాని నరేంద్ర మోదీ...బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు అభినందనలు తెలిపారు. రిషి సునక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇరు దేశాలకు అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై అందరి దృష్టి పడింది. దీనిపైనా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. "ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైనా చర్చించాం. వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రిషి సునక్ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించారు. "యూకే, భారత్ మధ్య సత్సంబంధాలున్నాయి. భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యంలో రెండు దేశాలు కలిసి భవిష్యత్‌లో ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలన్న ఉత్సాహంతో ఉన్నాను" అని ట్వీట్ చేశారు సునక్. FTA విషయంలో ఈ ఏడాది జనవరి నుంచే బ్రిటన్, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో FTAకి మద్దతు తెలిపారు సునక్.
ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ అతనిని ఓడించారు. అయితే 45 రోజులకే ఆర్థిక సంక్షోభం కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో రిషి సునక్ ఎన్నిక లాంఛనం అయింది. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు 144 మంది సభ్యుల మద్దతు లభించింది.
Also Read: Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'