Gujarat Election 2022: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం.. కేవలం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది.


హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ పదవీకాలం 2023, జనవరి 8తో ముగియనుంది.


కీలక తేదీలు



  • నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25

  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29

  • పోలింగ్ తేదీ: నవంబర్ 12

  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబర్ 8


మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఊసే కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తలేదు. ఎందుకిలా?


ఇదేనా రీజన్?


హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో న‌వంబ‌ర్ 12న ఒకే విడ‌త‌లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. డిసెంబ‌ర్ 8న ఓట్లు లెక్కించి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నుంది. అంటే పోలింగ్‌కు ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌ధ్య 26 రోజుల స‌మ‌యం ఉంది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. గుజ‌రాత్‌లో విడ‌త‌ల వారీగా పోలింగ్ నిర్వ‌హించ‌డానికి అనువుగా ఈసీ హిమాచ‌ల్ కౌంటింగ్ తేదీని డిసెంబ‌ర్ 8గా నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం. గుజరాత్‌ శాసనసభ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది.


2017లో


గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.


ABP- C ఓటర్ సర్వే


ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది. ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది.


మొత్తం 182 స్థానాల్లో భాజపా 135-143 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఆప్‌ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 46.8%, కాంగ్రెస్‌కు 32.3%, ఆప్‌నకు 17.4% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 36-44 సీట్లు వస్తాయని, ఆప్‌ సున్నా లేదంటే 2 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది. 


Also Read: Himachal Pradesh Election 2022 Date: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల