Gujarat Election 2022:


మరో ఆరుగురి పేర్లు.. 


గుజరాత్‌ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే 160 మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించిన కాషాయ పార్టీ.. ఈసారి ఆరుగురితో కూడిన మరో లిస్ట్‌ని ప్రకటించింది. ధోరాజి, ఖంబాలియా, కుటియానా, భావనగర్ ఈస్ట్, దేదియపడ, చోర్యాసి నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. గుజరాత్‌లో మొత్తం 182 నియోజకవర్గాలున్నాయి. ఇప్పటి వరకూ ప్రకటించిన పేర్లలో 14 మంది మహిళలున్నారు. మొత్తం 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో బీజేపీ ఒకేసారి 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 14 మంది మహిళలు కాగా, 13 మంది ఎస్‌సీ వర్గానికి, 24 మంది ఎస్‌టీ వర్గానికి చెందిన వారు. మొత్తం 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి పోటీ చేసే అవకాశమిచ్చింది బీజేపీ. "ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థుల పేర్లలో మార్పులు చేర్పులు సహజం. ఈ సారి కూడా అదే జరిగింది. ఎన్నో చర్చలు, సర్వేల తరవాత తుది జాబితాను సిద్ధం చేశాం. చాలా మంది కొత్త వాళ్లకు ఈ సారి అవకాశం ఇచ్చాం. అత్యధిక మెజార్టీతో వీళ్లంతా గెలవాలని కోరుకుంటున్నాం" అని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాటిదార్ వర్గానికి చెందిన హార్దిక్ పటేల్‌కు టికెట్ ఇచ్చి...ఆ వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది బీజేపీ. అటు ఆప్‌ కూడా కాస్త గట్టిగానే బీజేపీని ఢీకొట్టాలని వ్యూహ రచన చేస్తోంది. 






అగ్రేసర్ గుజరాత్..


"అగ్రేసర్ గుజరాత్" (Agresar Gujarat) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది బీజేపీ. పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలో సూచించాలని ప్రజలను కోరింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీ ఆర్ పాటిల్ ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ నెల 15 వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. గాంధీనగర్‌లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వేదికగా ఈ క్యాంపెయిన్ వివరాలు వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టోపై సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గురించి ప్రస్తావించిన సీఆర్ పాటిల్...ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "సుదీర్ఘ కాలంగా నిర్లక్ష్యానికి గురైన హామీలు నెరవేర్చాం. బీజేపీ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేదే లేదు. ఈ ఎన్నికల్లో మేము రికార్డు స్థాయిలో విజయం సాధిస్తాం. అంతకు ముందే ప్రజల సూచనలు,  సలహాలు తీసుకోవాలనుకుంటున్నాం" అని వెల్లడించారు. 2017లో బీజేపీ ఇచ్చిన హామీల్లో 78% మేర నెరవేర్చినట్టు స్పష్టం చేశారు. 75 ఏళ్లకు పైబడిన అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగరని తెలిపారు. అంతే కాదు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీల కుటుంబ సభ్యులకూ టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. 


Also Read: Himachal Elections: హిమాచల్‌లో ప్రశాంతంగా పోలింగ్, అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ