Gujarat AAP Candidate List:


విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన..


గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగిపోయింది. భాజపా, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ రేసులో ఉన్నప్పటికీ...ప్రధాన పోటీ మాత్రం భాజపా, ఆప్ మధ్య కనిపించనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపా కన్నా ముందుగానే ప్రచారం మొదలు పెట్టింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేజ్రీవాల్ అయితే...ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. మరో విషయం ఏంటంటే...భాజపా కన్నా ముందుగానే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆప్. ఆ తరవాత వరుసగా దూకుడుగా ఈ జాబితాలు ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏడో విడత లిస్ట్‌ను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులతో కూడిన జాబితా ఇది. ఇప్పటి వరకూ మొత్తంగా 86 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఆప్. ఆరో విడత లిస్ట్‌లో 20 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.


ఆప్ హామీలివే..


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు షాక్ ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ వ్యూహాలు రచిస్తోంది. ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. పలు హామీలు ప్రకటించారు.


1. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
2. రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తాం
3. అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి
4. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తాం. 
5. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తాం.


ఆప్ నెల రోజుల ముందే క్యాంపెయినింగ్ షురూ చేసింది. తరవాత భాజపా గౌరవ్ యాత్ర పేరిట పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల తేదీలు ఎప్పుడైనా వెలువడుతాయి. అయితే...మూడు పార్టీలు శక్తిమేర ప్రయత్నిస్తున్నా ఈ సారి గుజరాత్ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నదే ఉత్కంఠగా మారింది. దీనిపైనే  ABP News కోసం  C-Voter (ABP News C-Voter Survey)ఓ సర్వే చేపట్టింది. గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ బలం పుంజుకుంటే కాంగ్రెస్ బలహీన పడుతుందా అన్న ప్రశ్నకు 44% మంది అవుననే సమాధానమిచ్చారు. 33% మంది ఆ ప్రభావం తక్కువే అని తేల్చి చెప్పారు. ఇక 23% మంది ఆప్‌తో కాంగ్రెస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని వెల్లడించారు. 


2 విడతల్లో ఎన్నికలు..?


మొత్తం రెండు విడతలుగా  గుజరాత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో భాగంగా నవంబర్ చివరలో ఎన్నికలు నిర్వహించి...డిసెంబర్ 4-5 తేదీల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకేసారి జరగనున్నట్టు సమాచారం. గుజరాత్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న 
ముగుస్తుంది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో చివరిసారి 2017లో ఎన్నికలు జరిగాయి. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 


Also Read: Kishan Reddy : కేసీఆర్ ఫిరాయింపుల గ్రేట్ మాస్టర్, ఆ స్వామీజీ ఎవరో తెలియదు- కిషన్ రెడ్డి