Indian Cough Syrups: 


పూర్తిస్థాయిలో అధ్యయనం..


ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO..భారత్‌లో తయారైన నాలుగు కాఫ్ సిరప్‌లతో ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించింది. ఇప్పటికే గాంబియాలో 66 మంది చిన్నారులు ఈ సిరప్‌ వల్లే మృతి చెందారని తేల్చటం..సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. వెంటనే... దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. నలుగురు సభ్యులతో కూడిన ఓ నిపుణులు ప్యానెల్ నియమించింది. ఈ సిరప్‌ల తయారీపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశించింది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (DCGI)ఎలాంటి చర్యలు తీసుకోవాలో..ఈ ప్యానెల్ నిర్ణయిస్తుంది. అంటే...ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు తదుపరి అడుగులు పడతాయి. సోనిపట్‌లోని మైడెన్ ఫార్మా కంపెంనీ తయారు చేసిన దగ్గు మందు వల్లే గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని WHO తేల్చి చెప్పింది. ప్రొమితజైన్ ఓరల్ సొల్యూషన్, కాఫెక్స్‌మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌లనూ ప్రమాద జాబితాలో చేర్చింది. ఇవన్నీ
మైడెన్ ఫార్మా కంపెనీ తయారు చేసే మందులే. ఈ విషయంలో కేంద్రం ఓ స్పష్టతనైతే ఇప్పటికే ఇచ్చింది. WHO పేర్కొన్న సిరప్‌లన్నీ కేవలం ఎగుమతి కోసం తయారు చేసినవే. భారత్‌లో వాటిని వినియోగించటం లేదు. అంతే కాదు..ఇక్కడ వాటిని అమ్మటానికీ వీల్లేదు. 


హరియాణాలో ప్లాంట్ మూసివేత..


హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్లాంట్‌ను మూసేసింది ప్రభుత్వం. అంతే కాదు. ఈ సిరప్ ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. "WHO చెప్పిన సోనిపట్ ఫార్మా కంపెనీకి చెందిన మూడు సిరప్‌ల శాంపిల్స్‌ని కలకత్తాలోని డ్రగ్ ల్యాబ్‌కు
పంపాం. వీటి రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఇవీ ప్రమాదకరమని తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం" అని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. అయితే..ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో ఆయా సిరప్‌ల ఉత్పత్తిలో 
అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు అందించింది ప్రభుత్వం. రికార్డులు సరిగా నిర్వహించ కపోవటం, ఏయే ప్రమాణాలు ఉపయోగించి సిరప్‌లు తయారు చేస్తున్నారో వివరాలు తెలియజేయకపోవటం లాంటి వాటిపై సీరియస్‌గా ఉంది హరియాణా ప్రభుత్వం. అసలు ఆ కాఫ్‌ సిరప్‌కు సంబంధించిన బ్యాచ్ నంబర్స్‌ని కూడా ఎక్కడా మెన్షన్ చేయకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది. ప్రోపిలీన్ గ్లైకాల్, సోర్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పారాబెన్‌ లాంటి రసాయనాలు ఇందులో ఉన్నట్టు గుర్తించారు. ఇక సిరప్ ప్రొడక్షన్‌కు సంబంధించిన వాలిడేషన్ ప్రాసెస్‌నూ స్పష్టంగా చెప్పకపోవటం మరో సమస్య. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో తయారైన ఈ ఉత్పత్తుల్లో  డైఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.


Also Read: Hijab Ban Verdict: హిజాబ్‌పై సుప్రీం భిన్న తీర్పులు- ఎటూ తేల్చని సర్వోన్నత న్యాయస్థానం!