TN Governor RN Ravi:


క్లారిటీ ఇచ్చిన గవర్నర్..


తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య వైరం పెరుగుతూనే ఉంది. EWS రిజర్వేషన్ల విషయంలో మొదలైన రగడ ముదురుతూ వచ్చింది. ఇప్పుడు మరో వివాదమూ తెరపైకి వచ్చింది. తమిళనాడు పేరు మార్చి "తమిరగమ్" అని పెట్టాలని గవర్నర్ సూచించినట్టు కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ RN రవి స్పందించారు. తమిళనాడు వర్సెస్ తమిరగమ్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని,అర్థం చేసుకోకుండానే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. "దీన్ని అనవసరంగా వివాదాస్పదంగా మార్చుతున్నారు. తమిళనాడు పేరు మార్చాలని చెప్పినట్టు నా వ్యాఖ్యల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు" అని వెల్లడించారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా బంధం ఉందని...
దాని గురించి చెబుతూ "తమిరగమ్" అనే పదాన్ని వాడానని తెలిపారు. అప్పట్లో తమిళనాడు లేదని చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపుతున్నాయి. "కేవలం చారిత్రక నేపథ్యాన్ని ఉద్దేశించి మాత్రమే నేను ఆ పదాన్ని వాడాను" అని స్పష్టతనిచ్చినా...ఆయనపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. "ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండానే తమిళనాడుకి నేను వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. దీన్నో పెద్ద వివాదంగా మార్చేశారు. అందుకే దీనిపై క్లారిటీ ఇస్తున్నాను" అని అన్నారు గవర్నర్ RN రవి. దేశం మొత్తం ఓ విధానం అనుసరిస్తే...దాన్ని కాదని వ్యతిరేకించడం తమిళనాడుకి అలవాటైపోయిందని విమర్శించారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు "క్విట్ తమిళనాడు" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గెటౌట్ రవి అనే హ్యాష్‌ట్యాగ్ కూడా అప్పట్లో ట్విటర్‌లో ట్రెండ్ అయింది. తమిరగమ్ అంటే "తమిళుల ఇల్లు" అని అర్థం. 


పెరుగుతున్న వ్యతిరేకత..


గవర్నర్ ఆర్‌ఎన్ రవి సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చిన వాళ్లతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే... సివిల్ సర్వీసెస్ అధికారులంతా కేంద్రానికి సపోర్ట్ ఇవ్వాలని అన్నారు ఆర్‌ఎన్ రవి. "కేంద్రం, రాష్ట్రం మధ్య ఏదైనా విభేదం వస్తే మీరు తప్పకుండా కేంద్రానికే మద్దతుగా నిలబడాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు" అని తేల్చి చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో EWS రిజర్వేషన్ల అమలుపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. స్టాలిన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుని ససేమిరా అంటున్నారు. సామాజిక న్యాయం కోణంలో ఆలోచిస్తే ఇది విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వంతో విభేదించిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డీఎమ్‌కే మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎమ్‌కేకి మద్దతునిచ్చే విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు దిగుతున్నాయి. గవర్నర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. తమిళనాడు రాజ్‌భవన్‌పై ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు కూడా అంటించారు. 


Also Read: Joshimath Sinking: జోషిమఠ్‌కు వానగండం తప్పదా? మంచు కూడా కురిసే అవకాశం - అధికారులు అలెర్ట్