ఖమ్మం బీఆర్ఎస్​ బహిరంగ సభకు జనాల్ని తరలిస్తే సర్పంచులకు తన పంచాయతీరాజ్‌ శా​ఖ నుంచి రూ.10 లక్షల చొప్పున  ఇప్పిస్తానని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఖమ్మం సభ కోసం కార్యకర్తలతో నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పటికే  నర్సింహులపేట మండల కేంద్రంలో దయాకర్​రావు చేసిన వ్యాఖ్యలు  బీఆర్​ఎస్‌​కు చెందిన 25 మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వారిని మారిస్తే  పార్టీ​ వంద సీట్లు గెలుస్తుందని చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో వీడియో వైరల్ గా మారుతుంది.


మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా ఖమ్మం బహిరంగ సభకు టార్గెట్ ప్రకారం జనసమీకరణ చేసిన సర్పంచులకు నా పంచాయతీరాజ్​ శాఖ నుంచి అదనంగా రూ.10 లక్షల చొప్పున ఫండ్స్​ ఇప్పిస్తా.. టార్గెట్ పూర్తి చేయని వాళ్లకు అదనపు నిధులు ఇవ్వబోం అని సభాముఖంగా తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 


ఖమ్మం సభలో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు. సభలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సకల సదుపాయాలను సమకూర్చుతున్నారు.


మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు  పేరుతో పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్ద వంగరకు చెందిన అభిమానులు మంచినీళ్ల బాటిలను తయారు చేసి సభలో కార్యకర్తలకు దాహం తీర్చేందుకు సిద్దం అయ్యారు. 


భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి, ప్రపంచానికి మకుటాయ మానంగా వెలిగేందుకు, రైతు ఈ దేశానికి రాజు అయ్యేందుకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు  నేతృత్వంలో జరుగుతున్న ఈ సభ వైపు దేశ మొత్తం ఆసక్తిగా చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎజెండా ఈ దేశ భవితవ్యానికి దిక్సూచి కానుందని తెలిపారు ఎర్రబెల్లి. ఈ సభకు అశేషంగా హాజరై ముఖ్యమంత్రి కేసీఆర్  చెప్పే ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర మొదటి అడుగు కావాలని ఆకాంక్షించారు. సభకు హాజరయ్యేందుకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వస్తున్న బస్సులకు జెండా ఊపి స్వాగతం పలికారు.