Andhra Pradesh Rains | అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు (జులై 27న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రాణాలకే ప్రమాదమని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్
ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి, తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులలో వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికు చేరనప్పటికీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంతాలతో పాటు లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గోదావరి వరద ఉధృతి పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు ప్రాజెక్టులు, ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టం వివరాలు ఆదివారం ఉదయం ఇలా ఉన్నాయి.- భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.6అడుగుల నీటిమట్టం - కూనవరం వద్ద నీటిమట్టం 14.9మీటర్లు - పోలవరం వద్ద 10.23 మీటర్లు - ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులు- కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక/ లంకగ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
దిగువకు విడుదల చేస్తున్నా పెరుగుతున్న నీటిమట్టంశనివారం రాత్రి 7 గంటల సమయానికి నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 35.3 అడుగులకు చేరగా, ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 4.44 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. తుంగభద్ర నదిలో 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
టోల్ ఫ్రీ నెంబర్లుఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో తాజా పరిస్థితిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యల కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నది పరివాహక ప్రాంతాల వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.