Godavari Express Silver Jubilee Celebrations : గోదావరిలో పడవ ప్రయాణం...గోదావరి ఎక్స్ ప్రెస్ లో రైలు ప్రయాణం ఒకే అనుభూతిని కలిగిస్తాయి. హైదరాబాద్ నుంచి (Hyderabad) విశాఖ(Visaka) వెళ్లాలంటే ఒకప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, వీఐపీల దగ్గర నుంచి సామాన్య ప్రజలందరినీ ఒకటే ఒక ఆప్షన్ గోదావరి ఎక్స్ ప్రెస్(Godavari Express)...ఇప్పటికీ విశాఖ వెళ్లే వారు మొదటి బెర్తు వెతికేది గోదావరి ఎక్స్ ప్రెస్ లోనే ….ఆ బండిలో సీట్లన్నీ అయిపోయాంటేనే....ఆ తర్వాత ఆప్షన్ కు వెళ్తారంటే అర్థం చేసుకోవచ్చు....ఈ రైలుబండితో ఆ ప్రాంత ప్రజలకు బంధం ఎంత గట్టిగా పెనవేసుకుందో....అయినా అంబాసిడర్ కారు, బజాజ్ చేతక్, గోదావరి ఎక్స్ ప్రెస్ ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ఇప్పుడంటే విమాన సర్వీసు పెరిగిపోయాయి కానీ...అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి ఏ మంత్రి హైదరాబాద్ రావాలన్నా...ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నా గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కాల్సిందే
టైం అంటే టైమే....
దశబ్దాల తరబడి ఇంతమందిని ఆకట్టుకోవడానికి ఆ బండిలో ఏముంది చెప్పుమా అంటే ఠంచనుగా అందరూ చెప్పే ఏకైక మాట....గోదావరి అంటే టైం...టైం అంటే గోదావరి ఎక్స్ ప్రెస్ అంటారు. ఇప్పుడంటే అన్నీ కంప్యూటరైజ్డ్ సిగ్నిలింగ్ వ్యవస్థ, కరెంట్ తో స్పీడ్ గా పరుగులు తీసే వందేభారత్(Vandhe Bharath) రైళ్లు వచ్చాయి కానీ...ఇలాంటి ఆధునిక వ్యవస్థలు లేని కాలంలోనూ గోదావరి కరెక్ట్ టైంకు ప్లాట్ ఫారం మీదకు వస్తుందనేవారు. ఇక హాయిగా హైదరాబాద్ ఎక్కేసి...ఏ ఖమ్మం దాటే వరకు బాతాఖానీ కోట్టుకుంటూ కునుకేసేమనుకోండి.....పొద్దున్నే విశాఖ బీచ్ లో సూర్యభగవానుడి లేలేత కిరణాలను చూడొచ్చు. అందుకే ఈ బండికి అంత డిమాండ్. పైగా ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని రైళ్లు దాదాపు ఒడిశా, హౌరా వరకు వెళ్తుంటాయి. ఇక ఆ ఒడిశా కార్మికుల బీడీ పొగలు, గుట్కా వాసనలతో కడుపులో పేగులు కదిలిపోతాయి. కిటికీల పక్కన కూర్చుని వాళ్లు చేసే రచ్చ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదే మన గోదావరి ఎక్స్ ప్రెస్ అనుకోండి...మన గోదారోళ్లతోపాటు విశాఖ వరకు వెళ్లే వారే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మన గోదావరి ఎక్స్ ప్రెస్ కే..
ఐదు దశాబ్దాల అనుబంధం...
కేంద్ర బడ్జెట్ లో మన రైల్వే ప్రాజెక్ట్ లకు ఏమంత విదిల్చిన దాఖలాలు కూడా మరి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా....మన గోదావరి ఎక్స్ ప్రెస్ తొలిసారి పట్టాలపై ఎక్కి నేటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా వాల్తేరు నుంచి సికింద్రాబాద్ మధ్య పరుగులు తీసింది. మొత్తం 18 స్టేషన్లలో ఆగి ప్రయాణికులని ఎక్కించుకుని వెళ్లే ఈ రైలు 710 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు...మొత్తం 17 బోగీలతో దూసుకుపోయే ఈ రైలు సరాసరి వేగం గంటకు 57 కిలోమీటర్లు . గోదావరి విశాఖలో బయలుదేరిన సందర్భంగా అక్కడి అధికారులు రైలును పూలతో అలంకరించారు. కేక్ కట్ చేసి ముందస్తు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.