కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)తో తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారులు, కీలక ప్రాజెక్ట్‌ల గురించి ఆయనతో చర్చించారు. పలు రాష్ట్రా రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గడ్కరీని కోరారు. ఇవన్నీ జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలను కలిపే రహదారులను ఆమోదం తెలిపారు. మొత్తం 780 కి.మీల పొడవైన 6 రహదారులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,525 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయరహదారులుగా మార్చినందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెంపుతో రాష్ట్రంలో జాతీయ రహదారుల( National High Ways) పొడవు 4.987 కిలోమీటర్లకు పెరిగింది...



జాతీయ రహదారిగా గుర్తించండి
తెలంగాణ(Telangana)కే మణిహారంగా నిలవనున్న రీజినల్ రింగ్‌లో దక్షిణ భాగానికి కూడా జాతీయ రహదారి హోదా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని గడ్కరీని మంత్రి వెంకట్‌రెడ్డి కోరారు. భారతమాల పథకం ఫేజ్-I క్రింద నిర్మితమవుతున్న రీజినల్ రింగ్ రోడ్డు( Regional Ring Road) ఉత్తర భాగం గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ మంజూరయ్యింది. దీనికి ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతున్నది. నల్గొండ( Nalgonda) నగర బైపాస్‌ రోడ్డు గురించి మరోసారి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెంకట్‌రెడ్డి వివరించారు. సుమారు 15 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి డీపీఆర్ ఇంతకు ముందే సమర్పించామన్న కోమటిరెడ్డి.... ఈ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. అలాగే పట్టణంలో రోడ్డు విస్తరణ చేపట్టి స్ట్రీట్‌ లైట్లు, రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ల నిర్మించాలని కోరినట్లు మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు.

ట్రాన్స్‌పోర్టు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్
నల్గొండ జిల్లాలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కోసం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే 25 ఎకరాలను గుర్తించడం జరిగిందని వెంకట్‌రెడ్డి గడ్కరీకి వివరించారు. ఈ ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం 65 కోట్లను వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరీ చేయాలని కోరారు. దీని ద్వారా నల్గొండ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్ పోర్ట్ ఫీల్డ్ లో మెరుగైన ఉపాధి దొరుకుతుందని మంత్రి వెంకట్‌రెడ్డి గడ్కరీకి వివరించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, సింథటికి అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం, స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాటు గురించి క్రీడల శాఖ మంత్రికి డీపీఆర్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణానికి ఖేలో ఇండియా పథకంలో భాగంగా 33.5 కోట్ల నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరామన్నారు.

బీఆర్‌ఎస్ తీరు వల్లే జాప్యం
కేంద్రంతో బీఆర్‌ఎస్( BRS) ప్రభుత్వం పెట్టుకున్న కీచులాట వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ రావడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఎన్నో పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రకటించినా... ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. హైదారాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఆర్వోబీల నిర్మాణం కోసం 300 కోట్లు విడుదల చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారని మంత్రి వెంకట్‌రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో కీలకమైన ఉప్పల్‌- ఘట్‌కేసర్ మార్గంలో పైవంతెన పనులను గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందని మండిపడ్డారు. తెలంగాణకు అన్ని విధాల సహకరిస్తామని గడ్కరీ చెప్పారన్న ఆయన... కీలకమైన రాష్ట్ర రహదారులన్నీ జాతీయ రహదారులుగా మారుస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.