Germany Church Shooting:
జర్మనీలో ఘటన..
జర్మనీలో హాంబర్గ్ సిటీలోని ఓ చర్చిలో గన్‌ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. Jehovah's Witness చర్చిలో ఉన్నట్టుండి కాల్పులు మొదలయ్యాయని, ఫలితంగా కనీసం పాతిక మంది గాయపడ్డారని తెలిపారు. అయితే...మృతి చెందిన వాళ్లలో నిందితుడు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఎంత మంది చనిపోయారన్న లెక్కపై ఇంకా స్పష్టత రావడం లేదు. జర్మనీ పోలీసుల వివరాల ప్రకారం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన హాంబర్గ్ పోలీసులు...ప్రజల్నీ అలెర్ట్ చేశారు. ఎవరూ ఇల్లు దాటి బయటకు రావద్దని సూచించారు. ఈ దాడికి గల కారణాలేంటో ఇంతా తెలియలేదు. గార్డియన్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే...కొందరు ఆగంతకులు చర్చిలోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. చనిపోయిన అందరికీ బులెట్ గాయాలున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. గంటల పాటు కాల్పులు కొనసాగినట్టు సమాచారం. నిందితులు పారిపోయినట్టు భావించడం లేదని, మృతుల్లో వాళ్లూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు ట్వీట్ చేశారు.
"ఈ ఘటనలో పలువురు చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకు ఈ దాడి చేశారన్నది ఇంత వరకూ తెలియలేదు. స్థానికులను అలెర్ట్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకూ అందరినీ అప్రమత్తంగా చూశాం. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ మొదలు పెట్టాం"
- జర్మనీ పోలీసులు