Indian Army New Chief: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) బాధ్యతలు చేపట్టారు. జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌కి చెందిన ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్మీకి వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో చీఫ్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ద్వివేది సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1984లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లోని 18 బెటాలియన్‌లో చేరారు. కశ్మీర్ లోయతో పాటు రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ సి పాండే ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది వచ్చారు. జూన్ 11వ తేదీనే ద్వివేదిని ఆర్మీ చీఫ్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్నప్పటి నుంచే ఆటల్లో చురుగ్గా ఉండే వారు ద్వివేది. ఆ తరవాత NDAలో చేరి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫిజికల్ ట్రైనింగ్‌లో అవార్డులూ సాధించుకున్నారు. ఇదే ట్రైనింగ్ గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆర్మీ చీఫ్‌గా ఆయననే ఎన్నుకోడానికి ఓ కారణముంది.
అటు ఉత్తరం, పశ్చిమంతో పాటు ఇటు తూర్పులోనూ ఎడారులు, అత్యంత ఎత్తైన ప్రాంతాలు, బిల్టప్ ఏరియాలు..ఇలా అన్ని ప్రతికూల వాతావరణాల్లోనూ ఆయనకు పని చేసిన అనుభవముంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌పై పూర్తి స్థాయి పట్టుంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల్ని ఏరి వేసేందుకు స్పెషల్ ఆపరేషన్‌లు చేపట్టారు. అటు రాజస్థాన్ ఎడారిలోనూ ఇదే స్థాయిలో దూకుడు ప్రదర్శించారు. అస్సాం రైఫిల్స్‌లోనూ కమాండర్‌గా పని చేశారు ఉపేంద్ర ద్వివేది. అప్పటి నుంచి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేపట్టడంలో ఆరితేరిపోయారు. మొత్తం 40 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ నుంచి వచ్చే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దాదాపు రెండేళ్ల పాటు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గానూ పని చేశారు.