Rains in Mumbai: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. గత 12 గంటలకు ఏకధాటిగా వాన పడుతోంది. ముంబయి మొత్తం వరదలతో నిండిపోయింది. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. గతంలో వర్షాలు పడినప్పుడు ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా చుట్టూ పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరాయి. ఈ వీడియో ఎప్పటిది అన్నది తెలియకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గేట్‌వే ఆఫ్ ఇండియా చుట్టూ వరద నీళ్లు ఉన్న వీడియోని షేర్ చేసిన నెటిజన్ "Stay Safe Mumbai" అని క్యాప్షన్ పెట్టాడు. ఇదే వీడియోని మరి కొందరు షేర్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ మరి కొందరు నెటిజన్‌లు సూచిస్తున్నారు.
ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం ముంబయి పరిస్థితి ఇలాగే ఉంది. ములుంద్, మలబార్ హిల్స్‌లో రికార్డు స్థాయిలో 34 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా కేవలం గంటలోనే. గత 24 గంటల్లో ముంబయిలో 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అధికారులనూ టెన్షన్ పెడుతోంది. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వరదల ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే National Disaster Response Force (NDRF) టీమ్స్ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలకు సిద్ధమవుతున్నాయి. ముంబయిలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.