BAC Meeting On AP Assembly Sessions: ఈ నెల 26 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) తెలిపారు. ఈ మేరకు సోమవారం బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. టీడీపీ తరఫున సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసీపీ నేతలు మాత్రం గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుండగా.. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉప సంహరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు - ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. వీటిపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
'నలుగురు ప్యానెల్ స్పీకర్లు'
నలుగురు ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు స్పీకర్ తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వీటితో పాటు కొన్ని శ్వేతపత్రాలు సైతం ప్రవేశ పెట్టనుందని వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు 80 శాతం పూర్తయ్యాయని.. అవి 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వచ్చే సమావేశాల్లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని.. ఈ సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందువైపు నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్ - 2 తలుపులు తీశామని వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగం
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని.. అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. 'గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదు. రాష్ట్ర మూలధన వ్యయం 60 శాతం మేరకు తగ్గింది. జల వనరులు, రవాణా, రోడ్లు, భవనాలు వంటి శాఖలను నిధుల కొరత వెంటాడుతోంది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. విధ్వంసకర నిర్ణయాలు, వాటి పర్యవసానాలను పట్టించుకోకపోవడం యువతలో, ఉద్యోగార్థులలో అశాంతికి దారి తీసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది. ఉన్న అవకాశాలను వినియోగించుకొని ప్రజలకు న్యాయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం' అని గవర్నర్ పేర్కొన్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా.. జగన్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నల్ల కండువాలతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. అనంతరం గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.