Conversation Between YS Jagan And Raghurama: ఏపీ అసెంబ్లీలో (Ap Assembly) సోమవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ (వైఎస్ జగన్), టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రఘురామ.. జగన్ వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం ఏదో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని జగన్‌ను కోరగా.. హాజరవుతానని జగన్ బదులిచ్చినట్లు రఘురామ చెప్పారు. వారిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, గతంలో వైసీపీ ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు, జగన్ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో రఘురామను అరెస్ట్ కూడా చేశారు. అయినా, ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. గత ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. తాజాగా, వైఎస్ జగన్ సహా కొందరు అధికారులపైనా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జగన్‌, అధికారులపై కేసు కూడా నమోదైంది.


అసెంబ్లీలో హైలెట్స్ ఇవే..


కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వైసీపీ నేతల ఉద్రిక్తతల మధ్యే ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగం సమయంలోనూ వైసీపీ నేతలు నిరసన తెలిపారు.


పోలీసులపై జగన్ తీవ్ర ఆగ్రహం


మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. 'సేవ్ డెమొక్రసీ' అని నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు నేతల చేతుల్లోంచి ఫ్లకార్డులను లాక్కొని చించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకుని చించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉండదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా.? అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఉన్నారని.. అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడానికి కాదని ధ్వజమెత్తారు.


సభ నుంచి వాకౌట్ 


రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.


Also Read: YS Jagan: 'సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' - పోలీసులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత