G20 Summit 2023: 


రష్యా విదేశాంగ మంత్రి కామెంట్స్..


రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో పెద్ద చర్చే జరిగింది. రష్యాది కచ్చితంగా ఆక్రమణే అని పశ్చిమ దేశాలన్నీ గట్టిగానే వాదించాయి. రష్యాకి మద్దతుగా ఉన్న చైనా, ఇటలీ మాత్రం ఉక్రెయిన్‌నే నిందించాయి. డిక్లరేషన్‌లోనూ ఈ అంశంపై ముందు ఏకాభిప్రాయం రాలేదు. ఆ తరవాత భారత్‌ చొరవ తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త డిక్లరేషన్‌ని ప్రవేశపెట్టింది. అప్పుడు కానీ అన్ని దేశాలూ దానికి ఆమోద ముద్ర వేయలేదు. ఈ పరిణామాల మధ్య G20 సదస్సుకి హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ (Sergey Lavrov) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉక్రెయిన్ చేజేతులా తన దేశాన్ని నాశనం చేసుకుందని తేల్చి చెప్పారు. పశ్చిమ దేశాలకూ ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుందని సెటైర్లు వేశారు. 


"ఉక్రెయిన్‌ తన దేశ భూభాగాన్ని చేజేతులా ధ్వంసం చేసుకుంది. నాకు తెలిసి ఇప్పటికే పలు పశ్చిమ దేశాలకు ఈ విషయం అర్థమై ఉంటుంది. అయినా రష్యాపై ఆరోపణలు చేస్తున్నారు. రష్యా వ్యూహాలు ఫలించలేదని చెబుతున్నారు. ఉక్రెయిన్‌ అంశం ఎప్పుడు వచ్చినా సరే పశ్చిమ దేశాలు దానిపై పూర్తిస్థాయి చర్చ జరిగేలా సహకరించడం లేదు. కేవలం రష్యాపై ఆరోపణలు చేయడం తప్ప ఏమీ చేయడం లేదు. రష్యా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలని చెబుతున్నారు. ఇలా ఏకపక్షంగా మాట్లాడమేంటి..? సమానత్వ సూత్రం UN ఛార్టర్‌లో ఉందన్న విషయం మర్చిపోయారా"


- సెర్గే లవ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి 






శాంతి కోసమే ప్రయత్నాలు..


రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోతాయా అని మీడియా ప్రశ్నించగా...అందరం శాంతి వాతావరణం నెలకొల్పేందుకే ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు సెర్గే లవ్రోవ్. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే అని పుతిన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. 


"శాంతియుత వాతావరణం నెలకొనాలన్నదే అందరి లక్ష్యం. 18 నెలల క్రితమే ఇందుకు సంబంధించి మేం ప్రయత్నాలు చేశాం. డాక్యుమెంట్స్ సిద్ధం చేశాం. కానీ దానిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయలేదు. పుతిన్ ఇప్పటికే ఓ విషయంలో క్లారిటీ ఇచ్చారు. చర్చలకు సిద్ధమే అని చెప్పారు. కానీ నిజానిజాలేంటన్నది కచ్చితంగా పరిగణించాలి. నాటో విధానాల వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌ అధికారులు రష్యా పౌరులపై దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు"


- సెర్గే లవ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి