Stock Market:
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడమంటే మాటలు కాదు! ఇంటర్నెట్ బాగుండాలి. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సరిగ్గా పని చేయాలి. ఆర్డర్లు సరిగ్గా పెట్టాలి. సాంకేతిక సమస్యలేమీ ఉండొద్దు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా నిమిషాల్లోనే కోట్ల రూపాయలు బుగ్గిపాలవుతాయి. శుక్రవారం చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం.
సెప్టెంబర్ 8, 2023 శుక్రవారం స్టాక్ మార్కెట్లో వీక్లీ డెరివేటివ్స్‌కు ఎక్స్‌పైరీ డే. ఆ రోజు ఓ విచిత్రమైన ట్రేడ్ జరిగింది. 67,000 సెన్సెక్స్ కాల్ ఆప్షన్ విలువ రెప్పపాటు సమయంలోనే 5000 శాతం పెరిగింది. రూ.4.30గా ఉన్న ధర రూ.209.25కు చేరుకుంది. దీంతో కొందరు ట్రేడర్లు సెకన్లలో లక్షలు సంపాదించగా మరికొందరు లక్షల్లో నష్టపోయారు. దాంతో సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రంగంలోకి దిగింది. దర్యాప్తు మొదలు పెట్టింది.
ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం కొన్ని సెకన్లలో సాధారణ స్థితికి చేరినప్పటికీ డబ్బులు నష్టపోయిన ట్రేడర్లు ఆవేశంతో ట్వీట్లు పెడుతున్నారు. 'దారుణం. మధ్యాహ్నం 2:30 నుంచి నేనీ సమస్య ఎదుర్కొంటున్నాను. ఆర్డర్లను సర్దుబాటు చేయలేకపోయాను. కనీసం కొత్త ఆర్డర్లూ పెట్టలేకపోయాను. చాలా నష్టపోయాను' అని పెంచాల రెడ్డీ అనే యూజర్ పోస్ట్ చేశారు.
'సెన్సెక్స్ ఎక్స్‌పైరీ సాంకేతిక సమస్యతో ఉత్తగా డబ్బులు వచ్చేశాయి. నాకు సంతోషంగా ఉన్నప్పటికీ మిగతావాళ్లు డబ్బు నష్టపోవడంతో బాధపడుతున్నాను. నిజానికి నేను రూ.60వేల నష్టంలో ఉన్నాను. మార్కెట్లో మూమెంటమ్ లేనప్పటికీ హఠాత్తుగా ప్రీమియం పెరగడంతో 2 సెకన్లలో రూ.3.5 లక్షలు లాభం వచ్చింది. రూ.52 వద్ద కొని రూ.209 వద్ద అమ్మేశాను' అని కపిలన్ తిరుమవాలవన్ పేర్కొన్నారు. మార్కెట్లో ఇలాంటివి జరగడం ఇదే మొదటి సారి కాదు. ఆగస్టు 11న 45,700 స్ట్రైక్ బ్యాంకు నిఫ్టీ పుట్ ఆప్షన్ ప్రీమియం సెకన్లలో 90 శాతం పడిపోయింది.
సెప్టెంబర్ 8న ఏం జరిగిందంటే?
ఉదయం 11.02 గంటలకు సంబంధిత కాల్ ఆప్షన్ ప్రీమియం హఠాత్తుగా రూ.4.30 నుంచి రూ.209.25కు పెరిగింది. మరు నిమిషంలోనే దాని ధర రూ.5.45కు చేరుకుంది. కానీ అప్పటికే 5.49 లక్షల షేర్లు చేతులు మారాయి. ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక ట్రేడర్- మార్కెట్ ఆర్డర్ల బదులు లిమిట్ ఆర్డర్లు పెట్టడంతోనే ఇలా జరిగిందని కొందరు అంటున్నారు. లిమిట్ ఆర్డర్లో మనం నిర్దేశించిన ధరను మంచి కొనుగోలు చేయరాదు. మార్కెట్ ఆర్డర్ అయితే మార్కెట్లో ఏ ధరకు దొరికినా కొనుగోలు అవుతుంది. సాధారణంగా లిక్విడిటీ లేని ఆప్షన్లలో ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే కొందరు బ్రోకర్లు వీటిని కొనుగోలు చేసేందుకు అంగీకరించరు.
Also Read: జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్ ప్లాన్ భళా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.