టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్టు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగిపోయాయని సీపీఐ రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పడే యోచన లేదని అపిస్తోందని అన్నారు. జగన్ మొగోడు అయితే తాడేపల్లిలో ఉండి అరెస్టు చేయించి ఉండాలని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఇవాళ తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఐడీని జేపీఎస్ గా మార్చాలని, సీఐడీకి జగన్ ప్రైవేటు సైన్యంగా నామకరణం చేస్తే బాగుంటుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఐడీ జగన్ ప్రైవేట్ సైన్యంలో పని చేస్తుందన్నారు. మార్గదర్శి విషయంలో గానీ, రఘురామకృష్ణం రాజు విషయంలో గానీ సీఐడీ వ్యవహార శైలి చూస్తే ప్రభుత్వంకు సన్నల్లో పని చేస్తుందనే విషయం అర్థమైందన్నారు.


రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కర్నూల్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీబీఐ ఏమీ చేయలేకపోయిందని, గెస్ట్ హౌస్ లో కూర్చున్న అవినాష్ రెడ్డి గడ్డి పీక్కుంటూ కూర్చున్నాడని, ఎంపీని అరెస్టు చేయాలంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురు అవుతుందని చెప్పిన పోలీసులు, చంద్రబాబు విషయంలో ఎందుకు లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించలేదో ప్రజలందరికి తెలుసునన్నారు. పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేసేందుకు ఉన్నారని, సీఐడీ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. 


అమరావతి గురించి మాట్లాడినందుకు ఎంపీ జయదేవ్ పై కక్షపూరితంగా ప్రవర్తించడంతో పాటుగా అమరరాజా ఫ్యాక్టరీని ఇబ్బందుల్లోకి నెట్టాడని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందు పోకుండా అవరోధాన్ని అధికార పార్టీ కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భయాందోళనకు గురి చేయడమే కాకుండా, అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. అన్ని పార్టీలు ఒకటై రౌడీ రాజ్యంను తరిమి కొట్టాలని ఆయన కోరారు. 


జగన్ మొగోడు అయితే తాడేపల్లిలో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయించి ఉండాలని, కేంద్ర సహకారంతోనే జగన్ చంద్రబాబును అరెస్టు చేయించారనేది అర్ధం అయిందని అన్నారు. పుంగనూరు అల్లర్ల విషయంలో వందలాది మంది అమాయకులను జైల్లో పెట్టారని, పుంగనూరులో అల్లర్లకు వైసీపీ కారణం అని ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్జన్య కాండ మితిమీరిపోయిందని అన్నారు. చంద్రబాబుని కలిసి సంఘీభావం తెలుపుతామని సీపీఐ రామకృష్ణ అన్నారు.