భారత ప్రధాని నరేంద్ర మోదీ(Pm Narendra Modi)ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల(Maldives) మంత్రులను టీమిండియా క్రికెటర్లు(Cricketers) తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని గట్టిగా చెబుతున్నారు. మన దేశంలోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. అంటే కాదు భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ అంశంపై మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తదితరులు స్పందించారు. అలాగే భారతదేశ పర్యాటక రంగంపై విమర్శలు చేసిన మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'అతిథి దేవో భవ' సంస్కృతి కలిగిన మన దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు.
అసలేం జరిగిందంటే..
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్(Lakshadweep)లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారు. ఎప్పటిలాగానే తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను వైరల్ చేశారు. అయితే దీనిని తట్టుకోలేకపోయిన మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. భారత్‌లో బీచ్‌లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. భారతీయుల బాయ్‌కాట్ నినాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. భారత్‌పై చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే.. అది తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. భారత్‌పై వ్యాఖ్యలు తమకే నష్టమని.. అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ నేతలు చేసిన వ్యాఖ్యలు తమకే సిగ్గుచేటని ఇందుకు భారత్‌కు క్షమాపణలు తెలియజేస్తున్నానని మాల్దీవుల మంత్రి అన్నారు. తమ దేశంపై జరుగుతోన్న బాయ్‌కాట్ ప్రచారాన్ని ముగించాలని నెటిజన్లను అబ్దుల్లా అభ్యర్థించారు.
మరోవైపు ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు వెళ్లిన ఇబ్రహీం షహీబ్ వివాదంపై భారత ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన పరిణామాలను షహీబ్ వివరించారు. అయితే జరిగిన వివాదంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని భారత్ ఆయనకు స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహింలేనివని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ అన్నారు. మాల్దీవులు తన పొరుగు దేశాలతో సానుకూలంగా ఉంటుందని ప్రధాని మోదీపై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.