అప్పటి నుంచి బూస్టర్ డోస్ ఉచితం..


కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా బూస్టర్ డోసులు అందించనున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 75 రోజుల పాటు ఉచితంగా అందించనున్నారు. 18-59 ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకాలు అందిస్తామని తెలిపింది. అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బూస్టర్ డోస్‌లు తీసుకునే వారి సంఖ్యను పెంచాలన్నదే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలో 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారి జనాభా 77 కోట్లుగా ఉంది. వీరిలో 1% మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లకు పైబడిన 16 కోట్ల మంది జనాభాలో 26%, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కూడా బూస్టర్ డోస్ తీసుకోని జాబితాలో ఉన్నారు. 


భారత్‌లో దాదాపు చాలా మంది రెండో డోస్ తీసుకుని 9 నెలలు దాటిపోయింది. ICMR సహా పలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు... యాంటీబాడీస్ ఆర్నెల్లు మాత్రమే ఉంటాయని చెబుతున్నాయి. రెండు డోసులు తీసుకున్నా, బూస్టర్ డోస్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. అని కేంద్రం వివరిస్తోంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్-NTAGI గత వారమే కీలక ప్రకటన చేసింది. సెకండ్ డోస్‌కి, ప్రికాషన్ డోస్‌కి మధ్య 9 నెలల గ్యాప్‌ని ఆరు నెలలకు కుదించాలని సూచించింది. ఈ సూచనల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఆ వ్యవధిని 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.