రాష్ట్ర ప్రజల రక్తం తాగి, సంక్షేమ పథకాల పేరుతో ఆడవాళ్లకు తాయిలాలు ఇస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాళిబొట్టులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి సిగ్గు చేటు అని వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి హామీలు ఇచ్చిన వైఎస్ జగన్... అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నియంత్రణ అని మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు. 


జనాల రక్తం తాగి సంక్షేమ పథకాల పేరుతో ఆడవాళ్లకు బిస్కట్‌లు వేస్తున్నారని.. మూడేళ్ళలో 58 వేల 500 కోట్లు మద్యం మీద అప్పు తెచ్చారని తెలిపారు. ఎలాంటి అభివృద్ధి లేకుండా మద్యం ద్వారా ప్రభుత్వం నడవడం సిగ్గు చేటన్నారు వంగలపూడి అనిత. కొత్తగా పెట్టిన ఆదాన్ డిస్టీలరీస్ కి 1186 కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిందని, అదాన్ డిస్టీలరీస్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఓటేసిన పాపానికి జనాలను జలగల మాదిరిగా పీల్చుకు తింటున్నారని ఆమె మండిపడ్డారు.


మద్యంలో హానికర పదార్థాలు..
ఏపీ మద్యంలో హానికర పదార్దాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని  ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వం చెప్పిన ల్యాబ్ లోనే పరీక్షలు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో జంగారెడ్డిగూడెంలో మరణాలకు కారణం కల్తీ మద్యం అని తేలిందని గుర్తు చేశారు. మద్యం షాపుల్లో డిజిటల్ కరెన్సీ ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మద్యం నగదు నుంచి 30 శాతం జే ట్యాక్స్ వెళ్తుందని ఆరోపించారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత 160 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని చెప్పారు. మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరపాలని వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు.. అవసరమైతే రాష్ట్రపతికి సైతం రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై ఫిర్యాదు చేస్తామన్నారు.


నిషేధం అన్నారు, ఏరులై పారిస్తున్నారు..
రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పారని, ఇప్పుడు ఏరులై పారిస్తున్నారని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు అన్నారు. ముడుపులు ఇచ్చిన కంపెనీల మద్యం మాత్రమే రాష్ట్రంలో అమ్ముతున్నారని, మద్యంలో హానికరమైన పదార్థాలు ఎందుకు వస్తున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ నుంచి దేశం మొత్తం గంజాయి సరఫరా జరుగుతుందని, పలు రాష్ట్రాల్లో గంజాయి కేసుల్లో ఏపీకి లింకులు ఉన్నట్లు తేలిందన్నారు. క్వాలిటీ లేని మద్యం తాగి గ్రామాల్లో తెలియకుండానే ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నకిలీ మద్యంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read: Polavaram Floods : పోలవరం ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీరు - తొలి సారి ఆపరేట్ చేసిన అధికారులు


Also Read: AP Municipal Workers protest: ఏపీలో పేరుకుపోతున్న చెత్త, తగ్గేదే లేదంటున్న కార్మికులు