AP Municipal Workers Protest: ప్రభుత్వం మెట్టు దిగనంటోంది, కార్మికులు బెట్టువీడనంటున్నారు.. వెరసి మూడు రోజులుగా ఏపీలో ఎక్కడి చెత్త అక్కడే మిగిలిపోయింది. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా నగరాలు నరకాన్ని చూపెడుతున్నాయి. రోడ్లపైకి వచ్చి చేరిన చెత్త దుర్గంధం వెదజల్లుతోంది. చెత్తపన్ను పేరుతో ఇటీవలే ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి ముందు చెత్త పెట్టుకొని ఉండమని చెబుతోంది.
ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని భీష్మించారు కాంట్రాక్ట్ కార్మికులు. కాంట్రాక్ట్ వర్కర్స్ ని వెంటనే పర్మినెంట్ చేయాలని, హెల్త్ అలవెన్స్ లు ఇప్పించాలంటూ.. దాదాపు 23 డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. కనీసం పర్మినెంట్ ఎంప్లాయిస్ అయినా విధుల్లోకి వస్తున్నారనుకుంటే పొరపాటే. పని భారం ఎక్కువ కావడంతో వారు కూడా అంతంతమాత్రంగానే శుభ్రం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో చెత్త సమస్య అధికమవుతోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో కార్మికులు ప్రదర్శనలు చేపడుతున్నారు. కార్పొరేషన్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మంత్రుల బృందంతో కార్మికుల నేతలు చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. ముఖ్యంగా హెల్త్ అలవెన్స్ విషయంలో ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కార్మికులు కూడా తగ్గేది లేదంటున్నారు. విధులు బహిష్కరించి నిరసన కొనసాగిస్తున్నారు. మధ్యలో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ప్రత్యామ్నాయ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయా..?
దాదాపుగా పర్మినెంట్ వర్కర్లతో సమానంకా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ సమ్మెలోకి వెళ్లారు. దీంతో పర్మినెంట్ సిబ్బందిపై పనిభారం ఎక్కువైంది. అయితే వారిని కూడా పనులకు వెళ్లకుండా కాంట్రాక్ట్ వర్కర్లు అడ్డుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసుల సెక్యూరిటీతో పర్మినెంట్ వర్కర్లతో పనులు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
హెల్త్ అలవెన్స్ పై పీటముడి..
ప్రధానంగా హెల్త్ అలవెన్స్ దగ్గరే ప్రభుత్వానికి, మున్సిపల్ సిబ్బందికి మధ్య చర్చల్లో సందిగ్ధం ఏర్పడింది. హెల్త్ అలవెన్స్ గతంలో 6వేల రూపాయలు ఇచ్చేవారు. ఇటీవల పీఆర్సీతో జీతం పెరగడంతో, అలవెన్స్ మూడు వేల రూపాయలకు తగ్గించారు. దీన్ని పెంచాలని కోరుతున్నారు కార్మికులు. కానీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. మిగతా డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉన్నా కార్మికులు సమ్మె విరమిస్తేనే చర్చలు కొనసాగిస్తామంటున్నారు మంత్రులు. దీంతో కార్మికులు కూడా తగ్గేది లేదంటూ సమ్మె కొనసాగిస్తున్నారు.
వానలతో అవస్థలు..
అసలే వర్షాలు, ఈ దశలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోతే మరిన్ని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కార్మికుల సమ్మెకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడపంలో సఫలం కాలేకపోతోంది. వర్షాలతోపాటు ఇటు చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. త్వరలో దీనికి పరిష్కారం చూపాలంటున్నారు ప్రజలు. డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు సమ్మె విరమించేది లేదంటున్నారు కార్మికులు.