Emmanuel Macron On Modi:
యూఎన్ జనరల్ అసెంబ్లీలో..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలంటూ ప్రపపంచమంతా డిమాండ్ చేస్తోంది. అయినా..రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం మొండి పట్టు వీడటం లేదు. ఆర్నెల్లుగా కొనసాగుతూనే ఉందీ యుద్ధం. ప్రపంచ దేశాల అధ్యక్షులు పుతిన్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ గతంలోనే పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల షాంఘై సహకార సదస్సు (SCO)లో నేరుగా పుతిన్‌తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఆ సమయంలోనే యుద్ధం గురించి ప్రస్తావించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన కాలం కాదు. దీని గురించి గతంలోనే మీతో ఫోన్‌లో మాట్లాడాను. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మనకి ఇదో వేదిక. ఎన్నో దశాబ్దాలుగా భారత్-రష్యా మైత్రి కొనసాగుతోంది" అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. పలు దేశాల అధినేతలు ఆయన వ్యాఖ్యలపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పీఎం మోదీని ప్రశంసించారు. "ఇది యుద్ధాలు చేయాల్సిన సమయం కాదని భారత ప్రధాని మోదీ చెప్పిన విషయం అక్షరాలా నిజం" అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వెల్లడించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ 77వ సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మేక్రాన్. "పీఎం మోదీ చెప్పింది నిజం. పశ్చిమ దేశాలపై ఈ యుద్ధం ద్వారా పగ తీర్చుకోవాలనుకోవడం సరికాదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాల్సిన సమయమిది. అందరం కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి" అని అన్నారు.
భారత్-రష్యా మధ్య మైత్రి
అంతకు ముందు ఎస్‌సీఓ సమ్మిట్‌లో...ప్రధాని మోదీ పుతిన్‌తో యుద్ధం ఆపేయాలని సూచించారు. "వీలైనంత త్వరగా యుద్ధం ఆపివేయటం మంచిది" అని చెప్పారు. అయితే..దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. "ఉక్రెయిన్ విషయంలో మీ (భారత్) ఎటు వైపు ఉందో తెలుసు. మీ ఆందోళనలేంటో కూడా అర్థం చేసుకోగలను. ఈ యుద్ధాన్ని త్వరగా ఆపేయాలని మేమూ కోరుకుంటున్నాం. కానీ..ఉక్రెయిన్ ఇందుకు సహకరించటం లేదు. చర్చల విషయంలో ముందడుగు వేయటం లేదు. వాళ్ల డిమాండ్‌లు నెరవేర్చాలని మొండి పట్టు పడుతున్నాయి. అక్కడ ఏం జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు మీకు చెబుతూనే ఉంటాం" అని ప్రధాని మోదీకి వివరించారు పుతిన్. మొత్తానికి ఎస్‌సీఓ వేదికగా...పుతిన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగినట్టు స్పష్టమవుతోంది. రష్యాకు మైత్రి దేశంగా ఉన్న భారత్ కూడా స్పందించటం వల్ల ప్రాధాన్యత పెరిగింది. భారత్‌తో ఉన్న సంబంధాలను చాలా వ్యూహాత్మకమైనవి అని పుతిన్ అంగీకరించారు కూడా.
Also Read: Raju Srivastav Death: గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత