Building Collapsed in Surat: గుజరాత్‌లోని సూరత్‌లో ఆరంతస్తుల భవనం కుప్ప కూలింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వాళ్లను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. సచిన్ పలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల్ని తొలగించేందుకు సిబ్బంది శ్రమిస్తోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బిల్డింగ్ అప్పటికే కూలిపోయే దశలో ఉంది. భారీ వర్షాలు కురిసిన కారణంగా ఇప్పుడు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని, మరి కొంత మంది శిథిలాల కిందే చిక్కుకున్నారని ప్రాథమిక వివరాల ద్వారా తెలుస్తోంది.
మధ్యాహ్నం 3 గంటలకు బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఓ మహిళను రక్షించారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారన్నది ఇంకా తెలియడం లేదు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు సూరత్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాని చేరుకున్నారు. సహాయక సిబ్బంది జేసీబీ మెషీన్‌లతో శిథిలాలు తొలగిస్తోంది. సాయంత్రం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫ్లడ్‌లైట్స్ పెట్టుకుని ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది కార్మికులే ఉన్నట్టు తెలుస్తోంది. అంతా నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చి నిద్రపోతున్నారని. ఆ సమయంలోనే బిల్డింగ్ కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.