Floods Across 7 States: కేరళలోనే కాదు. మొత్తం 7 రాష్ట్రాల్లో భారీ వర్షాలు అస్యవ్యస్తం చేస్తున్నాయి. ఢిల్లీ పూర్తిగా నీట మునిగింది. నోయిడాలోనూ సబ్ వేలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు అన్ని చోట్లా వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి. 7 రాష్ట్రాల్లో ఈ బీభత్సం కారణంగా ఒక్కరోజే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో అయితే క్లౌడ్ బరస్ట్‌లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. షిమ్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత కురిసింది. ఫలితంగా 50 మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..హిమాచల్ ప్రదేశ్‌లో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అటు రాజస్థాన్, బిహార్, హరియాణాలోనూ ప్రాణనష్టం నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా బలి అయిన వారి సంఖ్య 283కి పెరిగింది. కేరళలోనే అత్యధికంగా 256 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మెప్పడి వద్ద భారీ వర్షాలు కురిసిన కారణంగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రభావం చుట్టు పక్కల ఊళ్లపైనా పడింది. మూడు రోజులుగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ-NCR ప్రాంతంలో జులై 31వ తేదీన సాయంత్రం (Heavy Rains in Delhi) ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క రోజులోనే 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నోయిడా, గుడ్‌గావ్, ఫరియాబాద్, ఘజియాబాద్‌లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. బిహార్‌లో పిడుగులు పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల క్లౌడ్ బరస్ట్‌లతో వరదలు ముంచెత్తాయి. రాజౌరిలో నదులు ఉప్పొంగుతున్నాయి. వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యూపీ, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బిహార్‌లో ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: Wayanad: నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో ఇప్పుడంత బాధ పడుతున్నా - వయనాడ్ విషాదంపై రాహుల్