Five Star Business Finance: ముందు నుంచి ఊహించినట్లే జరిగింది. NBFC ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ షేర్లు 5% డిస్కౌంట్‌తో ఇవాళ (సోమవారం, నవంబర్‌ 21, 2022) స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. షేర్‌ ఇష్యూ ప్రైస్‌ ₹450 కాగా, ₹449.95 వద్ద లిస్ట్ అయింది. BSE ప్రకారం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹13,110 కోట్లు.


ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ షేర్ల లిస్టింగ్‌ సమయానికి సెన్సెక్స్ 463 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 129 పాయింట్లు క్షీణించింది. ఇది కూడా షేర్‌ లిస్టింగ్‌ ప్రైస్‌ను దెబ్బకొట్టింది.


ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ ఐపీవో వివరాలు
ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నవంబర్ 9న ప్రారంభమై, 11వ తేదీన ముగిసింది. ఈ IPO సైజ్‌ రూ. 1,960 కోట్లు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 450-474గా కంపెనీ నిర్ణయించింది. ఈ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో వచ్చింది. కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదారులు ఈ ఇష్యూ ద్వారా తమ దగ్గరున్న షేర్లలో కొంత మొత్తాన్ని విక్రయించారు. 


SCI ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 166.74 కోట్లు, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ రూ. 719.41 కోట్లు, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్స్‌టెన్షన్ రూ. 12.09 కోట్లు, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్ ఎక్స్- మారిషస్ రూ. 361.45 కోట్లు, TPG ఏసియా SF రూ. 700.32 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్‌ చేశాయి. పూర్తిగా OFS రూట్‌లో సాగింది కాబట్టి, ఈ IPO మొత్తంలో ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్లదు. ఎవరైతే షేర్లను అమ్మారో, వాళ్ల సొంత ఖాతాల్లోకి వెళ్తుంది. ఈ డబ్బుతో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు.


ఇష్యూ సైజులో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌కు (QIBs), 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIs), మిగిలిన 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కోసం కంపెనీ కేటాయించింది. కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉనికి ఉండడం వల్ల, ఈ IPOకు వచ్చిన రెస్పాన్స్‌ పరమ చెత్తగా ఉంది. QIBs పోర్షన్‌ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవగా, NIIs కేటాయించిన వాటాలో కేవలం 61 శాతానికి బిడ్స్‌ వచ్చాయి. రిటైల్‌ పోర్షన్‌ మరీ తీసికట్టుగా మారింది. ఈ భాగానికి కేటాయించిన షేర్లలో కేవలం 11 శాతానికి బిడ్స్‌ వచ్చాయి. మొత్తంగా చూస్తే, ఈ IPOకు 70% స్పందన మాత్రమే వచ్చింది. దీని అర్ధం 100 షేర్లను అందుబాటులోకి తెస్తే, 70 షేర్లకు మాత్రమే డిమాండ్‌ కనిపించింది. 


ఫైవ్ స్టార్ బిజినెస్ IPOలో ఒక్కో లాట్‌కు 31 ఈక్విటీ షేర్లును కేటాయించారు. ప్రైస్‌ బ్యాండ్‌ గరిష్ట ధర (రూ.474) వద్ద, ఒక్కో లాట్‌కు అయిన పెట్టుబడి 14,694 రూపాయలు.


ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్‌ వ్యాపారం
ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఒక నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (NBFC). సురక్షిత చిన్న, సూక్ష్మ వ్యాపార రుణాలను అందిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ కంపెనీకి బలమైన ఉనికి ఉంది. ఉత్తర భారతదేశంలో దీని గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.