ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరీ జిల్లాలో హింస చెలరేగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించగా పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఏం జరిగింది?
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా లకింపూర్ ఖేరీ జిల్లాల్లోని టికోనియా-బందిపుర్ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ఆ రైతుల మీదకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రమాదం జరిగిన అనంతరం వేలమంది రైతులు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే ఈ ప్రమాదానికి కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. కేంద్ర మంత్రి కుమారిడి వాహనం సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.
కాంగ్రెస్ విమర్శలు..
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.