మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారా? కొంతమంది పోలీసులతో కలిసి వచ్చి మీ ఇంట్లో నుంచి మిమ్మల్నే దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తారు.. జాగ్రత్త! ఇందేంటి.. మా ఇంట్లో నుంచి మమ్మల్ని వెళ్లగొట్టే ధైర్యం ఎవరికి ఉంది అనుకోకండి. ఎందుకంటే ఇదంతా జరిగేది కోర్టు ఆదేశాల మేరకే. షాక్ అయ్యారా? అవును ఇటీవల బెంగళూరులో చాలా మంది యజమానులకు ఇదే షాక్ తగిలింది.
అంతా నకిలీ మయం..
"డబ్బు సంపాదించాలంటే హత్యలు, దోపిడీలు చేయక్కర్లేదు.. చట్టాల్లో ఉన్న లొసుగులు తెలుసుకుంటే చాలు".. ఇది ఓ సినిమాలో డైలాగ్. అయితే కర్ణాటక బెంగళూరులో కొంతమంది ఇలానే ఏకంగా ఫ్లాట్ లు, ఇళ్లు కబ్జా చేసేశారు. అది కూడా చట్టాన్ని ఉపయోగించి చేయడం మరింత ఆందోళనకర విషయం.
వీళ్లు ముందుగా ఓ ఇంటిని సెలెక్ట్ చేసుకుంటారు. దానికి తామే యజమానులుగా నకిలీ ఇంటి పేపర్లు తయారు చేస్తారు. ఆ తర్వాత సివిల్ కోర్టులో తమ ఇంట్లో అద్దెకు దిగిన వాళ్లు ఎన్ని సార్లు చెప్పినా ఖాళీ చేయడం లేదని కేసు వేస్తారు. ఆ తర్వాత వారికి అనుకూలంగా ఉత్తర్వులు రాగానే పోలీసుల సాయంతో ఒరిజినల్ యజమానినే ఇంటి నుంచి బయటకు పంపేస్తారు. ఇలాంటి కేసులు ఇప్పటివరకు 118 వచ్చినట్లు తేలింది.
అయితే ఈ కోర్టు ఉత్తర్వులు కూడా నకీలీ అయినట్లు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఇందులో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా కనీసం 6 లాయర్లు కుడా భాగమయ్యారు. సీఐడీ విచారణలో ఈ విషయాలు బయటకొచ్చాయి. ఏడాది క్రితం కర్ణాటక హైకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో భాగంగా ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది.
అరెస్ట్ లు..
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 12 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఫోర్జరీ, మోసం, కోర్టులను తప్పుదోవ పట్టించడం వంటి ఛార్జీలతో మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సీఐడీ తెలిపింది.
ఎలా తెలిసిందంటే..
2020 నవంబర్ లో ఓ కేసు విచారణలో భాగంగా ఈ రాకెట్ గురించి తెలిసింది. 2018లో తన సొంత ఆఫీసు నుంచి తనను ఖాళీ చేయించారని షా హరిలాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఆ స్థలాం 1954 నుంచి తమ అధీనంలోనే ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు చూపిస్తూ తనను ఖాళీ చేయించారన్నారు.
అయితే కోర్టు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సివిల్ కోర్టులో ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలనే కోర్టు ఉత్తుర్వులు వారికి అందినట్లు తేలింది. పోలీసుల సాయంతో అసలైన యజమానినే వారు ఖాళీ చేయించేశారు. ఈ మేరకు సివిల్ కోర్టులో 26-4-18న పిటిషన్ నమోదు కాగా, 31-05-18కే వారికి ఆ కోర్టు ఉత్తర్వులు దక్కాయి. ఇది చూస్తేనే ఈ రాకెట్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ వేగంగా విచారిస్తోంది.