Mark Zuckerberg Loses: మార్చి 5వ తేదీన సాయంత్రం కాసేపు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా అకౌంట్‌లు లాగౌట్ అవడం వల్ల యూజర్స్‌ ఆందోళనకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సర్వీస్‌లకు అంతరాయం కలిగింది. గంటకుపైగా సాంకేతికత సమస్యలు ఎదురయ్యాయి. ఆ తరవాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే...ఈ కారణంగా ఒక్కరోజే జుకర్‌ బర్గ్ భారీ ఎత్తున నష్టపోయారు. దాదాపు 3 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ ఒకేసారి నిలిచిపోవడం వల్ల ఈ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. Bloomberg Billionaires Index లో జుకర్‌ బర్గ్ ఆస్తుల విలువ 2.79 బిలియన్ డాలర్లు మేర తగ్గిపోయింది. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జుకర్‌బర్గ్ ఆ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. ఇదే క్రమంలో Meta షేర్స్ విలువ 1.6% మేర పడిపోయింది. Facebook,Instagram,Threadsలో టెక్నికల్ గ్లిచ్ కారణంగా వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు failure to load అని స్క్రీన్‌పై కనిపించినట్టు చాలా మంది నెటిజన్లు X వేదికగా పోస్ట్‌లు పెట్టారు. కొన్ని ఫేస్‌బుక్ అకౌంట్స్‌ అయితే ఆటోమెటిక్‌గా లాగౌట్ అయ్యాయి.