Tamilnadu Blasts :  తమిళనాడులో వరుస పేలుళ్ల కారణంగా పది మంది చనిపోయారు.  మంగళవారం శివకాశీలోని రెండు బాణాసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో పది మంది కార్మికులు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  మంటలు ఎగిసిపడుతుంటంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.                                                          


అక్టోబర్ 9న అరియలూరులోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిది మందిని సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలు రక్షించాయి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షించాలని రవాణా శాఖ మంత్రి ఎస్ ఎస్ శివశంకర్, కార్మిక శాఖ మంత్రి సీవీ గణేశన్ ను ఆదేశించారు.                                             


 






 


శివకాశిని భారతదేశ బాణసంచా రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా అనేక సార్లు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు పెద్ద సంఖ్యలో కూలీలు మృతి చెందారు. ఈ నగరంలో తరచుగా పేలుళ్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్మాగారాల్లో ప్రమాణాల కోసం.. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో డొల్లతనమే  కార్మికుల పాలిట శాపంగా మారుతోందన్న విమర్శలు ఉన్నాయి.  బాణసంచా కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం సుమారు 30 కోట్లతో భద్రత బోర్డును ఏర్పాటు చేసినా, పట్టించుకునే నాథుడే లేక నిరుపయోగంగా మారింది.            
 
 వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలుగా మారి  లక్షల మందికి ఉపాధి కలిగించడంతో  ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రముఖమైన ప్రాంతంగా శివకాశి నిలిచింది. 20వ శతాబ్దంలో 30 మందితో ఇక్కడ ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రాలు కాలక్రమేణా 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమలుగా విస్తరించాయి. ప్రస్తుతం దాదాపు ఆరు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి. బాణసంచా తయారీయే అక్కడి ప్రజల జీవనం, జీవనాధారం అయ్యింది.