జమ్ముకశ్మీర్ శ్రీనగర్ లో పేలుడు జరిగింది. నౌహట్టా ప్రాంతంలోని జామియా మసీదు వద్ద శక్తిమంతమైన ఐఈడీని పేలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు తెలియలేదు. గురువారం మధ్యాహ్నం ఈ పేలుడు జరిగింది.
కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన 2 ఏళ్లకు ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగించడానికే విద్రోహ శక్తులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు గాల్లో కాల్పులు జరిపాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా, స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
ఫలితాలు ఏమైనా వచ్చాయా?
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తీవ్రవాద చర్యలు 60 శాతం తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాళ్ల దాడులు 87 శాతం మేర తగ్గాయి. పర్యటక రంగం 20 నుంచి 25 శాతానికి తిరిగి పుంజుకుంది. అయితే అభివృద్ధి ఎలా ఉన్నా అక్కడి స్థానిక పార్టీలు మాత్రం దీనిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ కలిసి పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పేరుతో ఓ కూటమిగా ఏర్పడ్డాయి.
నిరసనలు..
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో శ్రీనగర్‌లో నిరసన చేశారు.