పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్‌ దాడులను ఇజ్రాయెల్‌ సైనికులు తిప్పి కొడుతున్నారు. రెండు వైపులా పరప్పర దాడులతో సరిహద్దుల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇప్పటికే రెండు వైపులా కనీసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ రిజర్వ్‌ డ్యూటీలో దాడులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సైనికులతో ఆయన కరచాలనం చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌ సైనికులు హమాస్‌ ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజా సమీపంలో సుమారు పదివేల మంది సైనికులను సమీకరించారు. 


ఇజ్రాయెల్‌పై దాడులు చేయడాన్ని ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హమాస్‌ ప్రాంతాలన్నింటినీ శిథిలం చేస్తామని గాజా పౌరులు అక్కడి నుంచి వెళ్లిపోవాని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్‌తో యుధ్దంలో ఉన్నామని ఆయన అధికారికంగానే ప్రకటించారు. గాజా నుంచి అక్టోబర్‌ 7న ఉదయం 6గంటలకు ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదులు జరిపిన భీకర దాడులతో యుద్ధం మొదలైందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పాలస్తీన, ఇజ్రాయెల్‌ల మధ్య దశాబ్దాల కాలంగా వివాదం నడుస్తోంది. కాగా ఇప్పుడు హమాస్‌ దాడులకు పాల్పడింది. నేలపై నుంచే కాకుండా రాకెట్లతో, సముద్రంపై నుంచి కూడా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.   హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించినప్పుడు ఏకంగా 30 నిమిషాల కాలవ్యవధిలో ఐదు వేల రాకెట్లను ప్రయోగించి మెరుపుదాడికి దిగింది. హమాస్ గ్రూప్ తన దాడిని "ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్" పేరుతో పిలుస్తోంది. వెస్ట్‌ బ్యాంకు నుంచి పోరాడే వారితో పాటు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలను కూడా తమ యుద్ధంలో చేరాలని హమాస్‌ పిలుపినిచ్చింది. తాము విజయం అంచున ఉన్నామని హమాస్‌ చీఫ్ ఇస్మాయిల్‌ హనియోస్‌ చెప్తున్నారు.


అయితే ఇజ్రాయెల్‌ కూడా గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే తాము హమాస్‌కు సంబంధించిన చాలా ప్రాంతాలపై పట్టు సాధించినట్లు చెప్తోంది. గాజాలో తలదాచుకుంటున్న సుమారు 400 మంది హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టున్నట్లు, పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దళాలకు, హమాస్‌ ఉగ్రవాదులకు మధ్య కిఫర్‌ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్‌ ప్రయత్నిస్తోంది.


ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడితో ఆ దేశంలోని ప్రభుత్వ, ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఏకమవుతున్నాయి. ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడితో ఆ దేశంలోని ప్రభుత్వ, ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఏకమవుతున్నాయి. ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా, భారత్‌, యూకే, జర్మనీ సహా పలు దేశాల మద్దతు లభిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అగ్రరాజ్యం నుంచి యుద్ధనౌకలను, యుద్ధ విమానాలను, కావాల్సిన సామాగ్రిని పంపిస్తున్నారు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్‌ ద్వారా ఇజ్రాయెల్‌కు తన మద్దతును తెలియజేశారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను ఖండించారు.